నుమాయిష్ అంటే హైదరాబాద్ ఎగ్జిబిషన 1930ల నుంచి ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా నగరవాసులను అలరిస్తూనే వుంది. దాని నమూనాలో తెలుగు జిల్లాల కేంద్రాలన్నిటా ఎగ్జిబిషన్ సొసైటీలు పుట్టుకొచ్చాయి కూడా. నాంపల్లిలోని 24 ఎకరాల పైబడిన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అనేక సంస్థలు కూడా వెలశాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ సొసైటీ అద్యక్షుడుగా వున్నారు. 2015లో ఉత్సవం ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలం ఇవ్వడంలో నాటి నిజాం ప్రభువు చూపిన దూరదృష్టిని కొనియాడుతూ ఉద్యమ కాలంలో నిజాం నిరంకుశపాలనపై మా మధ్య జరిగిన చర్చను కూడా తనకు అనుకూలంగా ప్రస్తావించారు. ఈ సొసైటీకి భూమి లీజుకు శాశ్వతంగా ఇస్తానని కూడా ప్రకటించారు. 2016లోనూ ఆయన ఎగ్జిబిషన్ ప్రారంభించారు గాని ఈ హామీ గురించి మళ్లీ చెప్పలేదు. ఈ ఏడాది ప్రారంభోత్సవం చేసిన కెటిఆర్ 99 ఏళ్ల లీజు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 2052 వరకూ లీజు వుంది. కాని ఇప్పుడు ఏకంగా ఆ ఎగ్జిబిషన్కే ఎసరు పెట్టింది ప్రభుత్వం. సొసైటీలో అవకతవకలు జరిగాయంటూ హఠాత్తుగా లీజు రద్దు చేసింది. మంత్రి మాటలు కూడా వినకుండా ఆ స్థలంలో క్లబ్లు నిర్మించడం వంటి ఘటనలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఏమైనా పాలకవర్గం తప్పు చేస్తే ప్రక్షాళన చేయాలి గాని ఎగ్జిబిషన్ స్థలాన్ని వెనక్కు తీసుకోవడం ఏమిటని అనేకమంది వ్యాఖ్యానిస్తున్నారు. జంట నగరాలలో ఎక్కడ ఖాళీ స్థలం వున్నా ఏదో ఒక నిర్మాణం కోసం తీసుకోవడం పరిపాటిగా మారింది గనక ఇది కూడా ఆ కోవలోదే అనుకుంటున్నారు. సైన్యానికి చెందిన బైసన్ పోలో మైదానం, ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రి స్థలం అన్నిచోట్టా ఇదే జరుగుతున్నది. అయితే స్వయానా ముఖ్యమంత్రి మాటఇచ్చి ఇప్పుడలా చేయడం ఆశ్వర్యంగా వుందని అంటున్నారు.