ఈటల రాజేందర్ భూముల్ని దళితలకు పంచేసింది తెలంగాణ ప్రభుత్వం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో జమున హేచరీస్ పేరుతో ఉన్న 70.33 ఎకరాల భూమిని 56మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ భూములు దళితుల నుంచి బలవంతంగా గుంజుకున్నారన్న ఆరోపణలతోనే కేసీఆర్ విచారణ జరిపింది. తొలుత ఒక్క రోజులోనే అధికారులు నివేదిక ఇచ్చారు. తర్వాత హైకోర్టు ఆదేశాలతో నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ జరిపి.. అవి అసైన్డ్ ల్యాండ్సేనని నివేదిక ఇచ్చారు.
దీంతో ఈటల కుటుంబం చేతిలో ఉన్న భూములను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే… ఆ పని కూడా పూర్తి చేసింది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అసైన్డ్ ల్యాండ్స్ ను మళ్లీ దళితులకు అప్పగించారు. ఈటల టీఆర్ఎస్లో ఉన్న సమయంలో తన కుటుంబానికి చెందిన పౌల్ట్రీ ఫాం కోసం దళితుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. అమ్మిన వారు కూడా తమ కుటుంబాల్లో పెళ్లిళ్లు.. ఇతర అవసరాల కోసం అమ్ముకున్నామని అవి సాగుభూములు కాదని చెప్పారు.
మీడియాకు కూడాఅదే చెప్పారు. అయితే ఈటలను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించిన తర్వాత వారు అడ్డం తిరిగారు. కలెక్టర్ నివేదిక మేరకు వారందరికీ తిరిగి భూములు అప్పగించారు. వాస్తవంగా అయితే అసైన్డ్ ల్యాండ్స్ ఇతరుల చేతికి వెళ్తే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ పాత లబ్దిదారులకే పంచేసింది.