బంగారు తెలంగాణ అనేది కేవలం ఓ నినాదంగా మారకూడదు. అది నిజంగా మారాలి. అందుకోసం కష్టపడాలి. కొత్తగా ఆలోచించాలి. కొత్త పథకాలు రూపొందించాలి. ఇవన్నీ కేసీఆర్ కు తెలుసు. అయితే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ఏది ముందు కొలిక్క తేవాలనే విషయంలో మాత్రం ఆయనకు స్పష్టం రాలేదేమో అనే అనుమానం కలుగుతుంది. మిషన్ కాకతీయ కొత్త ఆలోచన ఏమీ కాదు. తెలంగాణ, కాకతీయు పాలన అంటేనే చెరువులు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట దృష్టి పెట్టాల్సింది చెరువుల మీదే అని ఎంతో మంది మేధావులు ఎప్పటి నుంచో చెప్తున్నారు.
పక్కా ఇళ్ల నిర్మాణం, జలహారం, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా అనేక ఆలోచనలు ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ కొత్త ఆలోచనలు కొరవడ్డాయి. కొత్త ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఇప్పడిప్పుడే మొదలైంది. గ్రూప్స్ నోటిఫికేషన్ కోసం యువత ఆత్రుతగా ఎదురు చూస్తున్నది. కొత్తగా రుణాలు వచ్చే రోజు కోసం రైతులు, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. ఏరకమైన పత్రాలు లేని కౌలు రైతులను ప్రయివేటు వడ్డీ వ్యాపారులు పీల్చిపిప్పి చేస్తున్నారు. రుణమాఫీ కోసం ఇప్పటి వరకు 7 వేల కోట్లు ఖర్చు పెట్టినా, రోజూ ఏడెనిమిది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే రుణమాఫీ విఫలమైందని అర్థమవుతోంది.
తెలంగాణ సంపన్న రాష్ట్రం అని చెప్పుకుంటూనే ఎడా పెడా అప్పుడు చేస్తున్నారు. విదేశీ రుణాలు అప్పుడే 5వేల 500 కోట్లకు చేరాయి. మనకంటే పేద రాష్ట్రం ఏపీని మించిపోయి అప్పులు చేశాం. ఇంత భారీ అప్పుచేసి తెచ్చిన డబ్బును పైసా దుర్వినియోగం కాకుండా ఖర్చు పెట్టాలి. భవిష్యత్తులో అప్పులు చేసే అవసరం రాకుండా ఉండాలంటే ఏంచేయాలో ఆలోచించాలి. సంపన్న రాష్ట్రం పేద రాష్ట్రంగా మారితే ఇక బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో ఆలోచించాలి.
యువతకు కొత్తగా స్కిల్స్ డెవలప్ మెట్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కు భారీ ఏర్పాట్లు జరగాలి. ఈ దిశగా ప్రభుత్వం పెద్దగా చేసింది ఏమీ లేదు. రాజధానిలో రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అటవీ ప్రాంతంలోకంటే ఘోరంగా హైదరాబాదులో చాలా చోట్ల రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇక డ్రైనేజీ లీకేజీ, మురుగు నీరు ప్రవహించడం అనేది ఈ స్థాయి నగరాల్లో మరెక్కడా ఉండదేమో.
ఇలా ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లుంటే, కొత్త జిల్లాలకు తొందర ఏమొచ్చింది? ఇప్పటికే ఐ ఎ ఎస్ అధికారులకు కొరత ఉంది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎక్కడి నుంచి వస్తారు? కొత్త జిల్లాలు ఏర్పడగానే సమస్యలు క్షణంలో పరిష్కారం అవుతాయా? కావు. ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కనపెట్టి, రైతులు ప్రాణాలు తీసుకోకుండా ఆపడం ఎలా, యువతకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వడం ఎలా, స్కిల్స్ డెవలప్ మెంట్ శిక్షణ ఎలా ఇవ్వాలి, హైదరాబాద్ రోడ్లను రోడ్లు అని పిలిచేలా చేయడం ఎలా, అప్పులు చేయకుండా అభివృద్ధి సాధించడం ఎలా అనేది ఆలోచించాలి.
నాలుగు నెలలకోసారి సీఎం కాన్వాయ్ ను మార్చడం, దానికోసం కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టడం, సచివాలయానికి కొత్త భవనం కడతామనడం, సీఎం యాత్రల కోసం కొత్త బస్సును కొనడం, దానికి 5 కోట్లు వెచ్చించడం, కొత్త రాష్ట్రం చెయ్యాల్సిన పనులు ఇవేనా? కేసీఆర్ ప్రభుత్వం జరంత కుదురుగా ఆలోచిస్తే తత్వం బోధపడుతుంది. గుజరాత్ తర్వాత సంపన్న రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. గుజరాత్ లో ఎన్నో ఆదర్శవంతమైన విధానాలను ప్రభుత్వం పాటిస్తుంది. సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం గుజరాత్ తరహాలో పాలన అందించగలదా? రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మలచగలదా? అదే జరిగితే అదే అసలైన బంగారు తెలంగాణ.