జన సేనాధిపతి… రెండు తెలుగు రాష్ట్రాల లో తమ జనసేన పార్టీ ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇప్పటి దాకా ఆయన చేసిన పర్యటనలు అన్నీ ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అయ్యాయి. విభజన, పృభుత్వాల ఏర్పాటు అనంతరం… ఎప్పుడైనా కుదిరితే తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను పొగడడం తప్ప తెలంగాణ సమస్యల గురించి ఆయన మాట్లాడింది దాదాపు లేదనే చెప్పాలి.
అయితే 2019లో ఎన్నికల కు వెళ్లబోయే పార్టీగా ఇకనైనా తెలంగాణ లో తన వంతు ప్రచారం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ జనసేన కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు మురళి కుటుంబాన్ని పరామర్శించాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లో పర్యటనను ప్రకటించే సమయంలోనే ఆయన వెల్లడించారు. దాని ప్రకారం… ఏపీ లో పర్యటన పూర్తి అయిన తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి తెలంగాణ లోని గజ్వెల్ కు వెళ్లాలని పవన్ అనుకున్నారు. అయితే జనసేనాని ఒకటి తలిస్తే కేసీఆర్ మరొకటి తలిచారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి, నిరుద్యోగి మురళి కుటుంబాన్ని సందర్శించేందుకు గాను తాను గజ్వెల్ వెళ్లనున్నట్టు పవన్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. అయితే దీనిపై పోలీసులు శుక్రవారం స్పందించారు. పవన్ పర్యటనకు అవసరమైన బందోబస్తు తాము చేయలేమని, ప్రస్తుతం అయిదారుగురు మించి పోలీసులను కూడా పవన్ సెక్యూరిటీకి కేటాయించలేమని చెప్పేశారు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో గజ్వెల్ పర్యటన ను పవన్ వాయిదా వేసుకున్నారు.
దీనిని బట్టి చూస్తుంటే తెలంగాణ లో పవన్ హడావిడి చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా పవన్ ఎంచుకున్న కారణం కూడా కేసీఆర్ ప్రభుత్వానికి మింగుడు పడనిదే. ఏదేమైనా… నచ్చని వ్యక్తుల పట్ల, వ్యతిరేక రాజకీయ కార్యకలాపాల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో తెలిసిన వారు మాత్రం… తెలంగాణ లో పవన్ పార్టీ వేళ్లూనుకోవడం అంత ఈజీ కాదని తేల్చేస్తున్నారు.