ఒక రాష్ట్ర గవర్నర్ రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా పెద్దన్న పాత్ర పోషించాలి అంటారు. వివాదాస్పదం కాకూడదు అనీ చెబుతారు! కానీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై కొన్ని రాజకీయ పార్టీలు గుర్రుగా ఉన్న వైనం చూస్తున్నాం. తెలంగాణ సర్కారు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన అత్యంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చాలానే ఉన్నాయి. తెలంగాణలో దాదాపుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆయనపై ఆగ్రహంతో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మధ్య రాజ్ భవన్ లో కాంగ్రెస్ నేతలు, గవర్నర్ మధ్య మాటకు మాటా అన్నట్టుగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందనీ కథనాలు వచ్చాయి. అయితే, ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ కు మద్దతుగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమౌతున్నట్టు సమాచారం!
రేపు జరగబోయే గణతంత్ర వేడుకల్లో భాగంగా పేరేండ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను గవర్నర్ ఎగురవేస్తారు. ఆ తరువాత, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నరసింహన్ ప్రసంగం ఉంటుంది. అదే రోజు సాయంత్రం రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతుంది. ఇవి ప్రతీయేటా జరిగే కార్యక్రమాలే. ఈ కార్యక్రమాలకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతల్ని ఆహ్వానిస్తారు. ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు వెళ్లిపోయాయి కూడా! అయితే, ఎట్ హోమ్ కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నట్టుగా సీపీఐ నారాయణ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు ఎట్ హోమ్ కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, పేరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమానికి కూడా అధికార పార్టీ తప్ప… ఇతర పార్టీల నాయకులూ కార్యకర్తలు హాజరు అయ్యే అవకాశాలు లేదనేదే ఇప్పటివరకూ ఉన్న సమాచారం. కేసీఆర్ కు అత్యంత అనుకూలంగా వ్యవహరిస్తూ, తమ గొంతును వినేందుకు అవకాశం ఇవ్వని ఈ గవర్నర్ నిర్వహించే కార్యక్రమాలకు మేమెందుకు వెళ్లాలనేదే ప్రతిపక్షాల ముక్త కంఠంగా వినిపిస్తోంది.
పరిస్థితి ఇలా ఉండబోతోంది కాబట్టి… దీన్ని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమౌతున్నారు. పేరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెరాస నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు… ఇలా అందరూ తప్పనిసరిగా హాజరుకావాలంటూ హుకుం జారీ చేశారట! ఎట్ హోం కార్యక్రమానికి కూడా తెరాస నేతల పెద్ద సంఖ్యలో హాజరు కావాలనే వ్యూహంతో తెరాస ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలల కేసీఆర్, కాళేశ్వరం చంద్రశేఖరరావు అంటూ గవర్నర్ కీర్తించిన సంగతి తెలిసిందే. మరి, అధికార పార్టీని ఇంతగా వెనకేసుకొస్తున్న నరసింహన్ కు ఏదో ఒక రూపంలో కేసీఆర్ కృతజ్ఞత తెలిపాలి కదా! ఈ ఏర్పాట్లన్నీ దాన్లో భాగంగానే కనిపిస్తున్నాయి. ఇదీ విమర్శలకు తావిచ్చే అంశంగానే మారబోతోంది.