కమ్ముకొస్తున్న బీజేపీతో కేసీఆర్ యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతకు ముందే ఆయన యుద్ధమే అని ప్రకటించారు. కానీ అసలు యుద్ధం బీజేపీ ఎప్పుడో ప్రారంభించినట్లుగా అన్ని వైపుల నుంచి ఆయనను బీజేపీ కార్నర్ చేస్తోంది. ఓ రాజును టార్గెట్ చేయాలంటే ఆయనపై ఈగ వాలనీయాల్సిన అవసరం కూడా లేదని కానీ ఆయన బలాల్ని దెబ్బకొడితే చాలు. బీజేపీ అదే చేస్తోంది. కేసీఆర్ కుమార్తె, కుమారుల వ్యవహారాలకు సంబంధించి పూర్తి వివరాలతో రంగంలోకి దిగింది. అంతర్గతంగా జరుగుతున్నది ఏందో కేసీఆర్‌కు తెలిసింది. అందుకే… జాతీయ రాజకీయాల్లోకి వస్తానని బీజేపీని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ వర్కవుట్ కావడం లేదు.
బీజేపీతో రాజీకి రాలేని రాజకీయ పరిస్థితుల్లోకి కేసీఆర్ !
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. బీజేపీ రాజకీయ పరిస్థితుల్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు సిద్ధమయింది. ఎలా చూసినా ఇప్పుడు టీఆర్ఎస్ కార్నర్లో ఉంది. అటు ప్రభుత్వ పరంగా.. ఇటు ప్రభుత్వ ఆర్థిక నిబంధనల పరంగా.. అలాకే కేసుల పరంగా కూడా చక్రబంధనంలో ఇరుక్కుపోయారు. ఇప్పుడు బీజేపీపై పోరాటం తప్ప కేసీఆర్‌కు మాత్రం లేదు. ఆయన ముందున్న మరో మార్గం బీజేపీతో రాజీ చేసుకోవడం. అలా చేయడం అంటే.. ఇక పార్టీని.. తెలంగాణలో ప్రభుత్వాన్ని వారి చేతుల్లో పెట్టినట్లే. అదే జరిగితే యుద్ధం చేయకుండానే ఓటమి అంగీకరించినట్లు అవుతుంది. అలా చేయడం కన్నా రాజకీయ యుద్ధం చేయడం బెటరని కేసీఅర్ డిసైడయినట్లుగా భావిస్తున్నారు.
ఇష్టం లేకపోయినా బీజేపీతో యుద్దం చేయక తప్పదు !
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ఓడించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదీ దేశవ్యాప్తంగా. ఆ పార్టీతో యుద్ధం అంటే ప్రాంతీయ పార్టీలు పూర్తిగా నిర్వీర్యమైపోవాల్సిందే. బలమైన సిద్ధాంత బలం ఉన్న శివసేన వంటి పార్టీలకే అది సాధ్యం కాలేదు. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్నా.. సంస్థాగత నిర్మాణం పూర్తి స్థాయిలో లేని.. వలస నేతలపైనే ఆధారపడిన టీఆర్ఎస్ను ఓ ఆటాడుకోవడం బీజేపీకి పెద్ద విషయం కాదు. ఇప్పుడు అది ట్రైలర్‌గా చూపిస్తోంది కూడా. అయినా కేసీఆర్‌కు యుద్దం చేయక తప్పని పరిస్థితి.
తెలంగాణ ఉద్యమంలా విజయం సాధిస్తారా ?
ఓ రకంగా కేసీఆర్ ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నారు. ఆగినా .. దిగినా.. ప్రస్తుతం ఆయన చేస్తున్న రాజకీయం ఆయనకు ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు సురక్షితంగా గమ్యం చేసుకోవడమే కీలకం. అలా చేరితేనే ఆయనకు పార్టీకి.. మేలు. లేకపోతే.. ఇబ్బందికరమే. అయితే ఇలాంటి పరిస్థితుల్ని ఆయన గతంలో స్వయంగా తెచ్చి పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని సాధించి విజయం సాధించారు. అయితే ఓ సారి గెలిచారని ప్రతీ సారి విజయాలను వస్తాయనుకోవడం కూడా పొరపాటే. ఇప్పుడేం జరుగుతుందనేది వేచి చూడాలి.