సీఎం కేసీఆర్ ఏం చేసినా అనూహ్యంగా ఉంటుంది. దటీజ్ కేసీఆర్ అనుకునేలా చేస్తారు. తాజాగా కొండగట్టు ఆలయం విషయంలోనూ అదే చేశారు. ఇటీవల కొండగట్టును యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని రూ. వంద కోట్లు ప్రకటించి సీఎం కేసీఆర్ ఇవాళ.. వాటిపై సమీక్షించడానికి కొండగట్టు వెళ్లారు. అంజన్నను దర్శించుకుని .. సమీక్ష చేశారు. ఈ సమావేశంలో హఠాత్తుగా మరో ఐదు వందల కోట్లు మంజూరు చే్సతున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయింది.
దేశంలోనే అతి పెద్ద హనుమాన్ క్షేత్రం ఎక్కడ ఉందంటే కొండగట్టు అనే పేరు వినిపించాలని అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దేశంలోనే గొప్పగా హనుమాన్ జయంతి కొండగట్టులో జరగాలని.. భక్తుల హనుమాన్ దీక్షాధారణ, విరమణ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి బృహత్తర ప్రాజెక్ట్ అని.. భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఎ
సుమారు 850 ఎకరాలలో ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేయాలి. పెద్ద వాల్, పార్కింగ్, పుష్కరిణీ, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిణీ అభివృద్ధి చేయాలి. 86 ఎకరాలలో సువిశాల పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని కేసీఆర్ స్పష్టం చేశారు.వీటన్నింటికీ మరో ఐదు వందల కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
అయితే ఈ నిధులన్నీ నిజంగానే విడుదలవుతాయా అన్నది మత్రం సస్పెన్సే. ఎందుకంటే చాలా సార్లు ఇతర చోట్లకు వెళ్లిన కేసీఆర్ పంచాయతీలు, మున్సిపార్టీలకు రూ. కోట్లు ప్రకటిస్తారు. అవన్నీ రిలీజవవదలేదని … తరచూ వార్తలు వస్తూంటాయి. కొండగట్టు ఆరు వందల కోట్లు సంగతి ఏమవుతుందో కానీ.. ఇప్పటికైతే అంజన్న భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.