తమ పార్టీకి పొత్తులే అవసరం లేదని పొత్తులకు తాము వ్యతిరేకమని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ చెప్పారు. మాకు ప్రజలతోనే పొత్తు ఇంకెవరితోనూ ఉండదన్నారు. కానీ రెండు నెలల్లోనే బీఎస్పీతో పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడే పరిస్థితి వచ్చింది.
బీఎస్పీతో పొత్తులు పెట్టుకోవాలని కేసీఆర్ నిర్ణయంచుకున్నారు. కేసీఆర్ ఇంటికి తెలంగాణ బీఆర్ఎస్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లారు. చర్చలు జరిపారు. కేసీఆర్ ఆమోదం తెలిపారు. తాను బుదవారం మాయావతితో మాట్లాడి పొత్తుల విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. బీఎస్పీకి ఒక్క సీటు కేటాయిస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ కొన్ని సీట్లు కేటాయిస్తామని చెప్పడంతో ఆశ్చర్యపోవడం జర్నలిస్టుల వంతు అయింది.
బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని కేసీఆర్ అనుకున్నారు. ఈ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా వ్యతిరేకించారు. దాంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరో వైపు నేతలంతా పార్టీ మారిపోతున్నారు. ఈ క్రమంలో అన్ని చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. ఈ కారణంగా బీఎస్పీతో కలిసి వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
జాతీయ పార్టీగా చక్రం తిప్పాలనుకున్న స్థాయి నుంచి.. సొంత రాష్ట్రంలో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయలేక.. పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందన్న సెటైర్లు తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.