భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితాను కేసీఆర్ విడుదల చేశారు. మొత్తం 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. తాను స్వయంగా రెండు చోట్ల పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచీ పోటీ చేస్తానని చెప్పారు. కామారెడ్డి కాకుండా మరో ఏడుగురు సిట్ిటంగ్ స్థానాలకు అభ్యర్థులను మార్చారు. ఆదిలాబాద్ నుంచి ముగ్గురు ఎస్టీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను మార్చారు. ఇక ఎప్పుడూ వివాదాల్లో ఉండే తాటికొండ రాజయ్యకు గుడ్ బై చెప్పి కడియంకు చాన్సిచ్చారు. ఉప్పల్, వైరా ఎమ్మెల్యేల తీరు నచ్చక కొత్త వారికి సీట్లిచ్చారు. ఇక ఎక్కువగా జర్మనీలోనే అంటూ.. పౌరసత్వ వివాదం ఉన్న చెన్నమనేని రమేష్ కూ టిక్కెట్ నిరాకరించారు. కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్యం కారణంగా ఆయన వారసుడికి టిక్కెట్ ఇచ్చారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. అయితే చివరికి కేసీఆర్ కామారెడ్డి నుంచి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. గజ్వేల్ నుంచి నర్సారెడ్డి పోటీ చేస్తారని అంచనా వేస్తున్నారు. పెండింగ్ పెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో జనగామ ఒక్కటే ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేసుకోలేక పక్కన పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఆ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పోటీ పడుతున్నారు. గోషామహల్ సీటుకూ అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ్నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ వస్తే చేర్చుకుని టిక్కెట్ ఇస్తారేమోనన్న సందేహం వ్యక్తమవుతోంది. అయితే ఆయనను చేర్చుకుంటే ఎంఐఎం ఆగ్రహిస్తుంది కాబట్టి .. ఎంఐఎం చాయిస్ ప్రకారమే అభ్యర్థిని నిలపడానికి పెండింగ్ పెట్టారని అంటున్నారు.
మిగతా రెండూ పాతబస్తీలోనివే. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కేసీఆర్ ముగ్గురికి మాత్రమే సీట్లు నిరాకరించారు. అంతా పాత అభ్యర్థులే. ఈ సారి ఏడుగురికి నిరాకరించారు. ఆ ప్రకారం చూస్తే.. ఎమ్మెల్యేలంతా గత పదేళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న వారే. వారిపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంమలో కేసీఆర్ .. రిస్క్ తీసుకుని సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించారు.