తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రగ్స్‌పై అత్యున్నత సమావేశం పెట్టి ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు అమలు చేస్తే ఇప్పటి వరకూ కలుగుల్లో ఉన్న ఎంతో మంది వీఐపీలు కటకటాల్లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల టోని అనే స్మగ్లర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చాలా విషయాలు తెలిశాయని చెబుతున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఖరీదైన హోటళ్లకు, రేవ్పార్టీలకు, పబ్‌లకు చేరవేయడంలో ఓ రాజకీయ పార్టీ నేతది కీలకపాత్రగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.
గతంలో కర్నాటక పోలీసులు కూడా పలు కేసులు నమోదు చేశారు. అప్పట్లో పలుకుబడితో కర్ణాటక పోలీసులు తెలంగాణ వైపు రాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు వదిలి పెట్టేలా లేరు. ఇటీవల హైదరాబాద్ కమిషనర్ డ్రగ్స్ వాడుతున్నారంటూ అరెస్ట్ చేసిన వారంతా బడా పారిశ్రామికవేత్తలే. వీరిలో ఇద్దరు ప్రభుత్వ కాంట్రాక్టులు వందల కోట్లలో చేస్తున్నారు. వీరిద్దరూ ఓ మంత్రికి అత్యంత సన్నిహితులు. ఇంకా గుట్టుగా చాలా విషయాలు ఉన్నాయి.. కానీ అవి పోలీసులు.. రాజకీయవర్గాలలో బహిరంగ రహస్యం.
సమీక్షలో సీఎం కేసీఆర్ ” ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలి. ఎవర్నీ వదిలి పెట్టొద్దు అని అని పోలీసులకు సూచించారు. కేసీఆర్ ఆదేశాలను పోలీసుల సీరియస్‌గా తీసుకుంటే చాలా మంది జైలుకు వెళ్లడం ఖాయం. ఎక్కువగా అధికార పార్టీ నేతలే ఉంటారు. కానీ గతంలో డ్రగ్స్ కేసులు ఏ తీరానికి చేరాయో చూసిన వారు.. అది జరిగేది కాదని అంటున్నారు.