తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేనున్నానని సంకేతాలిచ్చారు. ఏమైనా సాయం కావాలంటే చెప్పండి అంటూ భుజాన చెయ్యి వేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ మాలాగే అక్కడ మీరు కూడా స్థానికంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇదంతా ఎవరిని అనుకుంటున్నారా…!! ఇంకెవరిని శత్రువుకు శత్రువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన అభయం. గత శాసనసభ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తెర వెనుక ఉండి సాయం అందించిన కేసీఆర్ ఇప్పుడు ఏపీ లో జరుగుతున్న స్థానిక ఎన్నికలలో కూడా “సాయం కావాలా జగన్” అని వర్తమానం పంపినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉమ్మడి శత్రువైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ని రాజకీయంగా నిలదొక్కు కోకుండా చేయాలన్నదే ఇద్దరి అభిమతం. దీనిని అనుసరించే ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పాలనా పరంగాను, రాజకీయ పరంగాను ఒక్కటి అవుతున్నారని ఇరు పార్టీల నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ సాయం అడిగినా చేసేందుకు వెనుక ముందు ఆడటం లేదు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న స్థానిక సమరంలో పార్టీని గట్టిగా దెబ్బ కొట్టాలన్నది రెండు రాష్ట్రాల సీఎంల లక్ష్యం. తెలంగాణ మంత్రులు, ఇతర నాయకులకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బంధుత్వాలు, స్నేహాలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోసం వాడాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో కులాలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని రాజకీయ చాణుక్యుడైన కేసీఆర్ కు మహా బాగా తెలుసు. ఏపీలో ఈ కార్డుని ఉపయోగించి చంద్రబాబును తీవ్రస్థాయిలో దెబ్బకొట్టాలని ది కేసీఆర్ లక్ష్యంగా చెబుతున్నారు. అందుకే స్థానిక ఎన్నికలలో తెరవెనుక నుంచి సాయం చేస్తానంటూ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వర్తమానం పంపారని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్గాలు చెబుతున్నాయి.