మంత్రి హరీష్ రావుపై ఈ మధ్య ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల సంగతి తెలిసిందే! తెరాస అధినేతను మార్చే ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలే చేశారు. అంతేకాదు, ఆయన ప్రోద్బలంతోనే కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరారనీ, హరీష్ రావు అధికార నివాసం చుట్టూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ విడుదల చేస్తే ఏయే నేతలు ఆయన ఇంటికి వెళ్లారో బయటపడుతుందని ఆయన ఆరోపించారు. ఇక, కేసీఆర్ ప్రత్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి కూడా ఈ తరహా విమర్శలే తీవ్రంగా చేశారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో హరీష్ టచ్ లో ఉన్నారూ, త్వరలో కండువా మార్చడం ఖాయమనే స్థాయిలో ఆయనా వ్యాఖ్యానించారు. దీంతో ఈ విమర్శలపై హరీష్ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాను ఎప్పటికీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానంటూ చెప్పుకోవాల్సి వచ్చింది.
ఆ విమర్శల్ని పరోక్షంగా తిప్పికొట్టే విధంగా కేసీఆర్ వ్యవహరించారు. ఆయన బుధవారం నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనతోపాటు, మేనల్లుడు హరీష్ రావును వెంటపెట్టుకుని గుడికి వెళ్లారు. తన నామినేషన్ పత్రాలతోపాటు, హరీష్ పత్రాలకూ ప్రత్యేక పూజలు చేయించారు. ఇద్దరూ గుడిలోనే పత్రాలపై సంతకాలు చేశారు. ఆ తరువాత, బయటకి వచ్చిన సీఎం కాసేపు సమీప గ్రామస్థులతో మాట్లాడుతూ… మంత్రి హరీష్ ను హైలైట్ చేశారు. ఇలాంటి మంత్రి దొరకడం మీ అదృష్టమనీ, ఈ ఎన్నికల్లో లక్షకుపైగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా మంత్రి హరీష్ పక్కనే ఉంటూ వచ్చారు. అంతేకాదు, కేసీఆర్ నామినేషన్ వేసేందుకు వెళ్లే ప్లాన్ అంతా హరీష్ దగ్గరుండి చూసుకున్నట్టు సమాచారం. కేసీఆర్ వెళ్తున్న మార్గంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలూ హడావుడీ లేకుండా చేసి, నామినేషన్ ప్రక్రియను అనుకున్న ముహూర్తానికి తు.చ. తప్పకుండా ఉండేలా అంతా ఆయనే ప్లాన్ చేశారట.
దీని ద్వారా కేసీఆర్ చెప్పాల్సింది చెప్పకుండానే చెప్పేశారని అనుకోవచ్చు. తమ మధ్య ఏదో ఉందనే విమర్శలు అర్థం లేనివనీ, తాము ఎప్పుడూ కలిసే ఉంటామనీ, తామంతా ఒకటే అనే సందేశాన్ని కేసీఆర్ పరోక్షంగా ఇచ్చారని అనుకోవచ్చు. తనతోపాటు నామినేషన్ పత్రాల పూజ దగ్గర్నుంచీ హరీష్ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా… తన దృష్టిలో మేనల్లుడు అంటే ఏంటో అనేది కూడా ప్రతిపక్షాలకు అర్థమయ్యేట్టు చేశారనీ అనుకోవచ్చు. ప్రతిపక్షాలు ఈ మధ్య చేస్తున్న విమర్శలకు ఇలా ఖండించారని అనుకోవచ్చు.