వచ్చే అక్టోబర్‌లోనే ఎన్నికలని… పూర్తిగా రెడీ కావాలని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ ప్లీనరీలో దిశానిర్దేశం చేశారు. అయితే డిసెంబర్లో కదా ఎన్నికలు రెండు నెలలు ముందుగానే ఎందుకు వస్తాయని చెబుతున్నారని ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇందులో లాజిక్ ఉందని… ఎమ్మెల్యేలను సన్నద్ధం చేయడానికే ఇలా చెబుతున్నారని అంటున్నారు. నిజానికి సమయం ప్రకారం జరిగినా అక్టోబర్ నెల ద్వితీయార్థంలో ఎన్నికల ప్రకటన ఉండొచ్చు. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉంటుంది.
అందుకే అక్టోబర్ డెడ్ లైన్ కేసీఆర్ పెట్టారని అంటున్నారు. ఈ సారి సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు దక్కవని పరోక్షంగా చెప్పారు. గతంలో ఎప్పుడు కార్యవర్గ సమావేశం జరిగినా కేసీఆర్ పార్టీ నేతలందరికీ.. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఓ భరోసా ఇచ్చేవారు. సిట్టింగ్‌లు అందరికీ మళ్లీ టిక్కెట్లు ఇస్తామని.. నియోజకవర్గాలకు వెళ్లి పని చేసుకోవాలనిచెప్పేవారు. కానీ ఈ సారి టోన్ కాస్త మారింది. ఇప్పటి వరకూ కేసీఆర్ .. కేటీఆర్ చేసిన హెచ్చరికల ప్రకారం చాలా మందికి టిక్కెట్లు డౌట్ అని ప్రచారం ప్రారంభమయింది.
. సర్వేల్లో అనుకూలంగా వచ్చే వారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పనితీరును మార్చుకోవాలని సిట్టింగ్‌లకు సూచించారు. గతంలో దాదాపుగా యాభై మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్ ఉండదన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. అదే సమయంలో అలాంటి ఎమ్మెల్యేల పేర్లు కొన్ని తెరపైకి వచ్చాయి. బీజేపీ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని తెలియగానే.. టీఆర్ఎస్ హైకమాండ్ అప్రమత్తమయినట్లుగా కనిపిస్తోంది. సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఉంటాయని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు మాత్రం యాభై మందికి కాకపోయినా 30 మందికి టిక్కెట్లు డౌటేనని చెబుతున్నారు.