వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్గా మారనుంది. డిసెంబర్ రెండో వారంలో ఢిల్లీలో భారీ బహిరంగసభ పెడతామని బీఆర్ఎస్ తరపున మీడియాకు లీకులొచ్చాయి. కానీ కేసీఆర్ మాత్రం డిసెంబర్లో పూర్తిగా తెలంగాణపైనే దృష్టి సారించనున్నారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడమే కాదు.. నాలుగైదు జిల్లాల్లో బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు . జగిత్యాలలో నిర్వహించే సభ బాధ్యతను కుమార్తె కవితకు అప్పగించినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు.
బరాబార్ జాతీయ రాజకీయాల్లోకి వస్తామని కేసీఆర్ చెబుతున్నారు. కానీ ముందుగా ఆయన.. తెలంగాణలో తేల్చుకోవాలనుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తాజాగా జరుగుతున్న పరిణామాలతో స్పష్టమవుతోదంంటున్నారు. అందుకే జిల్లాల పర్యటనలు.. పథకాల అమలు.. కొత్త పథకాల ప్రకటన.. ఇలాంటివి రానున్న రోజుల్లో మరింత పెరగనున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో గెలిస్తే తిరుగుండని.. జాతీయ స్థాయిలో మూడో సారి గెలిచిన సీఎంగా ప్రత్యేక క్రేజ్ వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఓ వైపు దర్యాప్తు సంస్థల దూకుడు ఎక్కువ అవుతోంది. పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో.. ముందుగా పట్టు పెంచుకోవాలని కేసీఆర్ డిసైడయ్యారు. పార్టీని బీఆర్ఎస్గు గుర్తించినప్పటికీ.. ఆయన ఢిల్లీలో రాజకీయాలు చేసేది.. తెలంగాణలో లెక్కలు సరి చూసుకున్న తర్వాతేనన్న అభిప్రాయం బలపడుతోంది.