ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన కెసీఆర్ యాభై రోజుల్లో వంద సభలు ప్లాన్ చేశారు. మంచి ముహుర్తం చూసుకుని హుస్నాబాద్‌లో తొలి సభ పెట్టారు. గణేష్ నవరాత్రుల కారణంగా విరామం ఇచ్చిన కేసీఆర్ ఇక వరుస సభలతో హోరెత్తించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా పలు జిల్లాల్లో బహిరంగ సభలకు షెడ్యూలు ప్రకటించారు. ఈ రోజు నిజామాబాద్, నాలుగో తేదీన నల్గొండ, ఐదున మహబూబ్ నగర్, ఏడో తేదీన వరంగల్, ఎనిమిదిన ఖమ్మంలో సభలు ఉంటాయని ప్రకటించారు. మిగతా వాటి సంగతేమో కానీ.. వరంగల్ సభను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. దీనికి కారణం.. అసంతృప్తి సద్దుమణగకపోవడమేనన్న ప్రచారం జరుగుతోంది.
జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయం లేదు. అభ్యర్ధులపై వ్యతిరేకతతో పాటు పలు కారణాలతో సభను వాయిదా వేశారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ముఖ్యంగా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నియోజకవర్గంలో తాటికొండ రాజయ్యకు వ్యతిరేకంగా అన్ని మండలాల నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయన అభ్యర్ధిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి శంకర్ నాయక్ ను మార్చాలంటూ మాజీ ఎమ్మెల్యే కవితతో పాటు ఉద్యమకారుడు బానోత్ రవినాయక్ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. ములుగు నియోజకవర్గంలోనూ చందూ లాల్ ను మార్చాలంటూ ఉద్యమకారులు పట్టుబడుతున్నారు. పాలకుర్తిలోనూ ఎర్రబెల్లి దయాకర్ రావుకు టిక్కెట్ ఇవ్వడాన్ని పార్టీ సీనియర్ నేత తక్కెళ్ల పల్లి రవీందర్ రావు తప్పుబడుతున్నారు. భూపాలపల్లిలోనూ సేమ్ సీన్ కనబడుతోంది. మధుసూదనా చారికి టిక్కెట్ దక్కడంతో గండ్ర సత్యనారాయణ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని మార్చాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది.
వరంగల్ తూర్పులో కొండా సురేఖ పార్టీని వీడటంతో ఆ నియోజకవర్గంలో టిక్కెట్ కోసం పోటీపడే వారి సంఖ్య ఎక్కువే ఉంది. పార్టీ నిర్ణయం కోసం ఆశావహులంతా ఎదురుచూస్తున్నారు. వరంగల్ వెస్ట్, వర్ధన్నపేట్, పరకాల నియోజకవర్గాల్లో మాత్రమే ప్రస్తుతం పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవు. మెజారిటీ నియోజకవర్గాల్లో అసమ్మతుల బెడదతో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో ఇక్కడ సభ నిర్వహించడం సరైన సమయం కాదని పార్టీ భావిస్తోంది. ముందుగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను అధిగమించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా మంత్రి కెటీఆర్ రంగంలోకి దిగి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా అసమ్మతి నేతలను పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహబూబాబాద్, స్టేషన్ ఘన్ పూర్ నేతలతో మాట్లాడారు. అన్నీ సద్దుమణిగిన తర్వాత సభ నిర్వహించే అవకాశం ఉంది.