తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 105 సీట్లలో గెలుపు ఖాయమని ప్రకటించారు. ఓ వైపు పదేళ్ల పాటు అధికారంలో వ్యతిరేకత.. ఎమ్మెల్యేల అరాచకాలతో నియోజవకర్గాల్లో గడ్డు పరిస్థితి ఉన్నప్పటికీ ఇలా కేసీఆర్ ప్రకటించడం రాజకీయవర్గాలకు అతిశయోక్తిగానే ఉంటుంది. అయితే కేసీఆర్ లెక్కలు కేసీఆర్ కు ఉన్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు. అందులో ప్రధానమైనది ఓట్ల చీలిక. ఇప్పటి వరకూ ఉన్న రాజకీయ పరిస్థితుల్ని బట్టి చూస్తే.. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కు ప్రమాదంగా మారలేదని.. రెండూ మధ్యలోనే ఉన్నాయని.. ఈ కారణంగానే కేసీఆర్ కు నమ్మకం పెరిగిపోయిందని అంటున్నారు.
ముక్కోణపు పోటీలో మూడు పార్టీలూ హోరాహోరీగా తలపడితే మూడో సారి విజయం సాధిస్తారనే అంచనా మొదటి నుంచి ఎన్నికల నిపుణులు వేస్తున్నారు. బీఆర్ఎస్కు సాలిడ్ ఓటు ఓటు బ్యాంక్ ఉంది. కానీ అధికార వ్యతిరేక ఓట్లను బీజేపీ, కాంగ్రెస్ పంచుకుంటున్నాయి. ఇక్కడే కేసీఆర్ అసలు కిటుకు ఉందంటున్నారు. బీజేపీని ఎక్కడి వరకూ పెంచాలో అక్కడి వరకూ పెంచి.. ఆ తర్వాత ఆపేశారని అంటున్నారు. ఇటీవల బీజేపీని టార్గెట్ చేయడం తగ్గించారు. ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యేలతో సమావేశంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.
కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న ఎన్నికల ట్రెండ్ ను చూస్తే.. ప్రజలు రేసులో ఎన్ని పార్టీలు ఉన్నా.. ఒకే పార్టీ వైపు మొగ్గుతున్నారు. మొన్న పంజాబ్.. నిన్న కర్ణాటకలను చూస్తే ఇదే అర్థం అవుతుంది. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ పదేళ్ల పాలన చాలు అనుకుంటే.. ఓ ప్రత్యామ్నాయం వైపు మొగ్గుతారు. ఆ ప్రత్యామ్నాయం బీజేపీ, కాంగ్రెస్ నా అన్నది తేల్చుకుంటారు. ఓట్లు చీలిపోతే మాత్రం బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్ క్లారిటీగా ఉండటమే.. కాన్ఫిడెన్స్ కు కారణం అంటున్నారు .