తెలంగాణలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికే విశాలమైన అధికారిక నివాసం ఉన్నప్పటికీ, మరింత అధునాతన అధికారిక భవనంలోకి మారబోతున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. దసరా నాడు ఆయన లాంఛనంగా గృహప్రవేశం చేయబోతున్నారు. ఈమేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి.
గ్రీన్ లాండ్స్ లో ఇప్పుడున్న సీఎం క్యాంప్ ఆఫీసు వెనుకే కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. 10 ఎకరాల విస్తీర్ణం అధికారిక నివాస సముదాయం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రెండెకరాల స్థలంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంటుంది. మిగతా స్థలంలో ఆడిటోరియం కాన్ఫరెన్స్ హాలు, సిబ్బంది క్వార్టర్లు వగైరా నిర్మిస్తున్నారు.
సుమారు 35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి మార్చి నెలలో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సముదాయంలో 250 సీట్ల మల్టీ పర్పస్ ఆడిటోరియం నిర్మిస్తున్నారు. అది కాకుండా 100 సీట్ల సామర్థ్యం గల కాన్ఫరెన్స్ హాలు నిర్మాణం జరుగుతోంది.
ప్రస్తుత క్యాంప్ఆఫీస్ ను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిర్మించారు. 2005 లో సుమారు 10 కోట్ల రూపాయల ఖర్చుతో దాన్ని నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వాస్తు పేరుతో మార్పులు చేర్పులకు మరో 10 కోట్ల వరకూ ఖర్చయింది.
అయినా. కొత్తగా క్యాంప్ ఆఫీస్ కావాలని కేసీఆర్ భావించారు. దీనికి 35 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తొలి అంచనా. అయితేపనులు పూర్తయ్యే నాటికి ఖర్చు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఎప్పుడు నెరవేరుతుందనే విషయం మాత్రం అంతుపట్టడం లేదు. హైదరాబాద్ లో ఒక్క చోట మాత్రం ఓ ఇళ్ల సముదాయాన్ని పూర్తి చేశారు.
మిగిలిన పేదలకు సొంత ఇంటికల నెరవేర్చడానికి ప్లాన్ చేయడం, చర్చలు జరపడం అంతా జరిగిపోతోంది. కానీ ఇళ్ల పనిమాత్రం మొదలుకాలేదు. ముఖ్యమంత్రికి మాత్రం లంకంత క్యాంప్ ఆఫీస్ ఉన్నా, ప్రజల డబ్బుతో మరో అధునాతన భవంతి అందుబాటులోకి రాబోతోంది. అన్నట్టు… దీన్ని పక్కా వాస్తు ప్రకారం నిర్మిస్తున్నారట.