తుమ్మల నాగేశ్వరరావు బలప్రదర్శన చేసి పార్టీ మారేందురు రెడీ కావడంతో కేసీఆర్ కొత్త ప్రతిపాదనలతో నేతల్ని రాయబారానికి పంపినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ సీటుతో పాటు ఢిల్లీలో బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ చక్కబెట్టే బాధ్యతను ఇస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కేకేకు ఇక ముందు పొడిగింపు ఉండదని… ఆయన స్థానంలో తుమ్మలకు చాన్సిస్తామని అంటున్నారు. ఈ మేరకు తుమ్మలతో చర్చలు జరిపే బాధ్యతల్ని హరీష్ రావుకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా రాజకీయాల్ని డీల్ చేయడం కేసీఆర్కు కూడా క్లిష్టంగా మారుతోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు తుమ్మల కూడా అదే బాటలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో చెప్పుకోదగ్గ లీడర్ ఎవరంటే పువ్వాడ అజయ్. ఆయన మీద సానుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక నామా నాగేశ్వరరావు జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీని జిల్లాలో నడిపించే నేత లేకపోవడం సమస్యగా మారింది.
అయితే ్ందరూ పార్టీలో ఉన్నప్పటికీ సమస్యలే ఎదురయ్యాయి. ఒకరితో ఒకరికి పడకపోవడం మూలంగా పార్టీకి నష్టం జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫిరాయింపులతో బీఆర్ఎస్ బలపడింది. కానీ నేరుగా విజయాలు మాత్రం సాధించలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్లు ఉంటే… 2014లో కొత్త గూడెం.. 2019లో ఖమ్మం అసెంబ్లీ సీట్లను మాత్రమే గెల్చుకుంది. మిగతా అన్ని స్థానాల్లో ఇతర పార్టీల నేతలు గెలిచారు. ఈ సారి కూడా సమీకరణాలు క్లిష్టంగా మారుతున్నాయి. కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు జత కడితే… పరిస్థితి క్లిష్టంగా మారుతుందన్న అంచనాలు ఉన్నాయి.