తెలంగాణ రాజకీయాలకు కేసీఆర్ తనదైన మార్క్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. సీఎం మార్పు అనేది ఉత్తుత్తి ప్రచారమేనని తేల్చేశారు. ఏ క్షణమైనా కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ … పార్టీ మొత్తానికి క్లారిటీ ఇచ్చారు. మరో పదేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని… ప్రకటించారు. తన ఆరోగ్యం బాగోలేదని.. అందుకే కేటీఆర్‌ను సీఎం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా కేసీఆర్ స్పందించారు. తన ఆరోగ్యం బేషుగ్గా ఉందన్నారు. ఇకపై ఎవరూ సీఎం మార్పు గురించి మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అసెంబ్లీ సాక్షిగా చెప్పానని గుర్తు చేశారు. అలా చెప్పిన తర్వాత కూడా.. కొంత మంది నేతలు కేటీఆర్ సీఎం అని మాట్లాడటం ఏమిటని.. అనవసర ప్రచారాలు చేయవద్దని గట్టిగా హితోపదేశం చేశారు. గీత దాటి మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వేళ తన ఆరోగ్యం బాగోలేకపోతే తానే చెబుతానన్నారు.
దాదాపుగా నాలుగు వందల మంది వరకూ టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. అత్యంత రహస్యంగా …సమావేశ వివరాలు బయటకు వెళ్లకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. నేతలందరి వద్ద ఫోన్లను ముందుగానే తీసుకున్నారు. రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. ఇందులో సీఎం మార్పు ప్రచారానికి తెర దించడమే లక్ష్యంగా కేసీఆర్ స్పీచ్ సాగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇక ఎవరూ సీఎం మార్పు గురించి మాట్లాడే అవకాశం లేకుండా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లయింది. కార్యవర్గ భేటీలో ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావ దివోత్సవం సందర్భంగా ఏప్రిల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే పన్నెండో తేదీ నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభిస్తారు. ఒక్కో ఎమ్మెల్యే, ఇంచార్జ్ కనీసం యాబై వేల సభ్యత్వాలను చేయించాలని టార్గెట్ నిర్దేశించారు. గ్రేటర్ మేయర్ అభ్యర్థి పేరును కూడా ఖరారు చేశామని ఎన్నిక రోజు అయిన పదకొండో తేదీన సీల్డ్ కవర్లో పంపిస్తామని స్పష్టం చేశారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా సీల్డ్ కవర్లోనే పంపుతామన్నారు. రెండు నెలల్లో జిల్లాలు మొత్తం పర్యటించాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు సంధి కాలంలో ఉంది. ఓటములు వెంటాడుతున్నాయి. ప్రజాదరణ కోల్పోతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఈ సమయంలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారం మరింత ఇబ్బందికరమని కేసీఆర్ అంచనా వేసి.. ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి.. స్పష్టత నిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ సీఎం అనే టాపిక్… ఆగిపోయే అవకాశం ఉంది. నిన్నామొన్నటిదాకా టీఆర్ఎస్ నేతలు కేటీఆర్ సీఎం అంటే… బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈటల సీఎం అనే ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ పొలిటికల్ మూడ్‌లోకి టీఆర్ఎస్ వచ్చినట్లియంది.