లోక్సభ ఎన్నికల సన్నాహాలను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వచ్చి పడిన సమస్యలకు తోడు.. కవిత అరెస్ట్ ఆయనను మరింతగా ఇబ్బంది పెడుతోంది. వరుసగా లీడర్లు కూడా ఎవరి దారి వారు చూసుకుంటూండటంతో నిస్సహాయులైపోయారు. కేటీఆర్ ఢిల్లీలో ఉంటున్నారు. ఈ పరిణామాల కేసీఆర్ ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోవడం లేదన్న నిర్ణయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు.
పలువురు ముఖ్యనేతలు కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా.. వారికి అపాయింట్మెంట్ దొరకడం లేదనే చర్చ కూడా నడుస్తున్నది. ప్రస్తుతం కేసీఆర్కు మేడిగడ్డ కుంగుబాబు అంశంలో విచారణ పెను సవాలుగా నిలువనున్నది. ఈ అంశంలో ఎట్టిపరిస్థితిలో ఆయనను చట్టం ముందు దోషిగా నిలబట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీనికితోడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ టార్గెట్ చేసుకుని ఉన్నది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదం ముందుకు వచ్చింది. వీటినుంచి తప్పించుకోవాలంటే బీజేపీ రక్షణ కోరడం మినహా కేసీఆర్కు మరో మార్గం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఎన్నికలు అయ్యే వరకూ కేసీఆర్ బహిరంగంగా ఏ నిర్ణయాన్నీ తీసుకోలేరు. అలాగని.. గట్టిగా పోరాడలేరు. ఆర్థికంగా బలం ఉన్న నేతలెవరూ పోటీకి రాలేదు. ఒక వేళ ఉన్నా.. ఆర్థికపరమైన కట్టడి అభ్యర్థులపై ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఎక్కడా సీరియస్ గా ప్రచారం చేస్తున్న దృశ్యాలు కనిపించడం లేదు. ఈ ఎన్నికలపై ఎక్కువగా దృష్టి పెట్టడం కన్నా… తాము సీరియస్ గా తీసుకోలేదన్న సంకేతాలను పంపితే బెటరన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. రెండు నెలల కిందట వరకూ తిరుగులేని స్థాయిలో ఉన్న పార్టీకి ఈ పరిస్థితి రావడం ఆ పార్టీ క్యాడర్ ను సైతం వేదనకు గురి చేస్తోంది.