ఒరిస్సా సీఎంను కలవడానికే కేసీఆర్ భువనేశ్వర్ వెళ్లారు.. కానీ అదే ఒరిస్సా సీఎం హైదరాబాద్ వస్తే మాత్రం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ ఏమీ చేయకపోయినా.. ఆయన వస్తున్నారని తెలిసినా.. హైదరాబాద్ తిరిగి రాలేదు. తమ రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పట్నాయక్ హైదరాబాద్ వచ్చారు. రెండు రోజులు ఆయన హైదరాబాద్‌లో ఉంటారు. ఓ రాష్ట్ర సీఎం మరో రాష్ట్రానికి వచ్చినప్పుడు.. ఆ రాష్ట్ర సీఎంతో మర్యాదపూర్వకంగా సమావేశం అవుతూ ఉంటారు. కానీ కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నందున అలాంటి సమావేశం జరిగే అవకాశం లేదు.
గత బుధవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఐదు రోజులుగా అధికారికంగా ఎవరితోనూ భేటీ అయినట్లుగా మీడియాకు సమాచారం ఇవ్వలేదు. రాజకీయ పార్టీల నేతలు మాత్రమే కాదు.. తటస్తులతో కూడా కేసీఆర్ ఎలాంటి భేటీలు నిర్వహించలేదని చెబుతున్నారు. ఈ 5 రోజుల్లో ఏ రాజకీయ పక్షానికి చెందిన నేతా ఆయన్ను కలవడానికి రాలేదు. రహస్య సమావేశాలు జరుగుతున్నట్లుగా కూడా టీఆర్ఎస్ వర్గాలు చెప్పడం లేదు. ఢిల్లీలో ఏ ముఖ్యమైన సమావేశం లేనప్పుడు కేసీఆర్.. అక్కడే ఎందుకు ఉంటున్నారని టీఆర్ఎస్ వర్గాలకూ అంతుబట్టని విషయం.
నవీన్ పట్నాయక్.. ఓ బలమైన ప్రాంతీయ పార్టీ నేత. ఒరిస్సాలో తిరుగులేని అధికారాన్ని నవీన్ పట్నాయక్ పార్టీ చెలాయిస్తోంది. అయితే జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టలేదు. వరుసగా గెలుస్తూ వస్తున్నా.. ఒరిస్సా బయట రాజకీయాలు చేయాలని ఆయన అనుకోలేదు. గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కోణంలో ఆయనతో సమావేశం అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెళ్లి చర్చలు జరిపారు. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి అందర్ని కలుస్తున్నారు. చాలా మంది ప్రగతి భవన్‌కే వచ్చి కలుస్తున్నారు. అలా నవీన్ పట్నాయక్ వచ్చి కలిసే అవకాశం ఉన్నా… కేసీఆర్ వద్దనుకుంటున్నారు.