యాదాద్రి ఆలయాన్ని కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. చుట్టుపక్కల ఇన్ ఫ్రా కూడా అద్భుతంగా డెవలప్ చేశారు. చూడటానికి ఆలయం.. పరిసర ప్రాంతాలు అద్భుతంగా ఉన్నాయి. మూడు ఘాట్ రోడ్లను కూడా నిర్మించారు. తిరుమల స్థాయిలో ఉన్న ఏర్పాట్లు చూసి.. ఆహా అని అందరూ అన్నారు. పార్కింగ్ చార్జీలు..ఇతర భక్తుల సౌకర్యాల గురించి పక్కన పెడితే.. హఠాత్తుగా బుధవారం రాత్రి కురిసిన వర్షం మొత్తం తేడా కొట్టేసింది. ఆలయ నిర్మాణం ప్రారంభించిన తర్వాత చాలా సార్లు వర్షాలు పడ్డాయి కానీ అంత చర్చనీయాంశం కాలేదు.
కానీ ఇప్పుడు ఆలయం ప్రారంభమైన తర్వాత పడిన వర్షాలు కావడం.. ఆ వర్షాల దెబ్బకు ఘాట్ రోడ్లు.. ధ్వంసం కావడం.. పెద్ద ఎత్తున అభివృద్ధి పనుల్లో లోపాలు బయటపడటంతో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఆలయంపై కేసీఆర్ కు ఉన్న శ్రద్ధ ఇదేనా అని ప్రశ్నించడం ప్రారంభించారు. సోషల్ మీడియాలోనూ విమర్శల పర్వం ప్రారంభమయింది. కేసీఆర్ యాదాద్రి ఆలయ పనులపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు ఈ అంశంపై రకరకాల కారణాలు చెబుతున్నారు. రోడ్ల కింద పైప్ లైన్ వేశారని.. నీళ్లు ఇంకిపోవడం వల్ల గోతులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అయితే ఒక్క రోడ్లే కాదు.. ఒక్క వర్షం అనేక లోపాలను బయట పెట్టింది. ఇప్పుడు కాంట్రాక్టర్ వాటికి రిపేర్లు చేయవచ్చు కానీ.. పనుల్లో మాత్రం నాణ్యత లేదని బయటపడింది. ప్రభుత్వానికి మాత్రం విమర్శలు దక్కుతున్నాయి. అందరూ సహజంగా కేసీఆర్నే టార్గెట్ చేస్తున్నారు . ఈ అంశంపై కేసీఆర్ ఏమైనా సమీక్ష నిర్వహిస్తారేమో చూడాలి.