తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గతంలో ఎప్పుడూ ఎదురు కానంత ఇబ్బందికర పరిస్థితి వచ్చి పడింది. అదే కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లాలా..? వద్దా ? అన్నదే ఆ సంకటం. ఎందుకంటే.. కుమారస్వామి ప్రమాణస్వీకార సభ… పక్కాగా…మోదీ వ్యతిరేక కూటమి సభగా ప్రచారంలోకి వచ్చేసింది. మోదీ వ్యతిరేకులంతా.. ఏకమవుతున్న సభగా జాతీయ మీడియా చెబుతోంది. అయితే కేసీఆర్ స్టాండ్ మాత్రం దానికి భిన్నం. ఆయన కాంగ్రెస్‌తో పోలిస్తే.. .. ప్రో బీజేపీ విధానాన్నే ఆయన ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ సహా అనేక విధానపరమైన నిర్ణయాలపై ..కేసీఆర్.. బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయంగానూ అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. టీడీపీ అధినేత కూటమి నుంచి బయటకు వస్తున్నారని తెలియగానే… వెంటనే తాను ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రకటించి .. తన కూటమిలో పార్టీలను కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలో పార్లమెంట్లో నరేంద్రమోదీపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి కానీ టీఆర్ఎస్ మాత్రం సభను నడవనీయకుండా చేసింది. దీంతో .. బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
ఆ తర్వాత పదిహేనో అర్ధిక సంఘం విధివిధానాలపై బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు పోరుబాట పట్టాయి. నిజానికి ఇలాంటి వివక్షను కారణంగా చూపే..ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం చేసిన కేసీఆర్.. ఈ వివక్షపై ముందుండి పోరాడాలి. పైగా.. ఈ విధివిధానాల మార్పు వల్ల అత్యధికంగా నష్టపోయే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. అయినా సరే.. మనకు ఉత్తరాది, దక్షిణాది భావనల్లేవంటూ… దూరంగా ఉండిపోయారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయమంటూ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో ప్రొ బీజేపీ విధానమే బయటపడుతోంది.ఇప్పటికే బీజేపీకి దగ్గరగా ఉన్న వైసీపీ, అన్నాడిఎంకే లాంటి పార్టీల జోలికి వెళ్లకుండా.. కేవలం కాంగ్రెస్‌తో కలసి సాగే అవకాశాలున్న పార్టీలనే… ఈ కూటమిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.
కూటమి ప్రయత్నాల్లో భాగంగా.. బెంగళూరు వెళ్లి దేవేగౌడతో సమావేశమైన కేసీఆర్.. ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రమాణస్వీకారానికి కేసీఆర్‌ను అహ్వానించారు. ఈ సభకు సోనియా, రాహుల్ హజరువుతున్నారు. వీరే కాదు.. అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు. అయితే వీరంతా.. మోదీ వ్యతిరేకులే. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో మోదీకి అవకాశం రాకుండా కలసికట్టుగా ప్రయత్నాలు చేయాలనుకుంటున్న వాళ్లే…!. ఇలాంటి సభకు కేసీఆర్ వెళ్తే.. కాంగ్రెస్‌కు అనుకూలంగా టీఆర్ఎస్ ఉందన్న ప్రచారం ప్రారంభమవుతుంది. వెళ్లకపోతే.. తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన దేవేగౌడ పార్టీకి కనీస గౌరవం ఇవ్వలేదన్న చెడ్డ పేరు వస్తుంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మధ్యేమార్గంగా ఆయనేం చేస్తారో చూడాలి..!