వారిద్దరూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు. ఒకరు ఎమ్మెల్యే.. ఆయన నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పి మరొకర్ని ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి న్యాయం మీరే చెప్పాలని కేసీఆర్ దగ్గరకు వెళ్తున్నారు. ఎవరి వైపు నిలబడితే మరొకరు అసంతృప్తి కి గురవుతారు. అందుకే… ఏటూ తేల్చుకోలేకపోతున్నారు.
2014 ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేకపోతే.. జలగం వెంకట్రావు ముందుకు వచ్చి పోటీ చేశారు. బీఆర్ఎస్కు బలం ఏమీ లేనప్పుడు వ్యక్తిగత బలంతో ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా నుంచి ఒక్కరే గెలిచినా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా జలగం పట్టించుకోలేదు. 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కాంగ్రెస్‌కు టీడీపీ సాయం దొరకడంతో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వనమా గెలిచారు.
తర్వాత వనమాను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. జలగం ను పట్టించుకోవడం లేదు. కానీ ఆయన ఎన్నిక అక్రమం అని జలగం కోర్టుకెళ్లారు. విచారణ జరిపి అసలు 2018 నుంచే జలగంను ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అమలు చేయాల్సిన బాధ్యత కేసీఆర్ సర్కార్ పై పడింది. తీర్పు కాపీ పట్టుకుని వెంటనే.. జలగం.. సీఎస్‌ను…. సీఈవోను కలిశారు. స్పీకర్‌కు ఫోన్ చేసి తనతో ప్రమాణం చేయించాలని కోరారు. కానీ ఏ నిర్ణయం తీసుకోలేదు.
వనమా.. తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ తీర్పు రిజర్వ్ అయింది. వనమా కాంగ్రెస్ లోనే ఉంటే… జలగంతో ఈ పాటికి ప్రమాణం చేయించేవారు. కానీ ఆయన కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. జలగం కావాలా… వనమా కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ హైకమాండ్ పడిపోయింది. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని జలగం చెబుతున్నారు.