ఎన్నికలకు కేసీఆర్ శరవేగంగా సిద్ధమవుతున్నారు. రోజుకో పథకాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన పథకాలను అమలు చేసేందుకు ఉత్తర్వలిస్తున్నారు. పెన్షన్లు పెంచుతున్నారు. తమ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఆయనకు అసలు సమస్య ఖాజానా ఖాళీనే.
ఏపీ ప్రభుత్వంలా అడ్డగోలు అప్పులు చేసుకోవడానికి తెలంగాణకు కుదరడం లేదు. కేంద్రం సహకరించడం లేదు. అందుకే కార్పొరేషన్ల నుంచి అదనపు అప్పుల కోసం ప్రయత్నిస్తోంది. హరీష్ రావు ఈ మధ్య కాలంలో పలు మార్లు ఢిల్లీకి వెళ్లి అదనపు అప్పుల కోసం పర్మిషన్ల తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే ఆర్బీఐ ద్వారా ప్రతీ నెలా నాలుగైదు వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణం తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున భూముల్ని అమ్ముతున్నారు. ఇవి సరిపోకపోవడంతో గ్యారంటీ అప్పులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీనికి కేంద్రం, ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నాయి. గ్యారంటీ అప్పు ఎట్లా తీరుస్తారనేది నివేదిస్తేనే వాటిని తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. దీంతో రాష్ట్ర సర్కార్ మొన్నటి దాకా గ్యారంటీ అప్పులను లైట్ తీసుకున్నది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం.. నిధుల కొరత మొదలవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. కనీసం గ్యారంటీ అప్పులనైనా పథకాలకు మళ్లించాలని చూస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కీములు కూడా ఖజానాలో పైసల్లేక ఆగిపోయాయి. జూన్ మొదటి వారంలో అమలు చేయాల్సిన రైతుబంధు జులై నెల చివరి దశకు చేరుకున్నా పూర్తి కాలేదు. ఇప్పటి దాకా 5 ఎకరాల లోపు ఉన్న పట్టాదారులకు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందింది. ఇంకో రూ.2,500 కోట్లు అయితేనే రైతుబంధు పూర్తవుతుంది. ఇక జులైలోనే మొదలుపెడుతామని చెప్పిన దళితబంధు, గృహలక్ష్మి స్కీముల అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇంతవరకు ప్రారంభించలేదు. బీసీ చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం స్కీమ్ గందరగోళంగా మారింది. మొదటిదశలో నియోజకవర్గానికి కేవలం 50 మందికే ఇచ్చారు. తాజాగా పెంచిన దివ్యాంగుల పెన్షన్‌కు, కొత్తగా మైనార్టీలకూ మొదలుపెట్టనున్న రూ. లక్ష ఆర్థిక సాయం వంటివి ఉత్తర్వులు వచ్చాయి. నిధులన్నింటినీ సమీకిరంచుకోవడమే ఇప్పుడు కేసీఆర్‌కు అసలైన సవాల్‌గా మారింది.