భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ కలసి వచ్చే ముఖ్య నేతంలదర్నీ నెలకోసారి పిలిచి బహిరంగసభలు పెట్టాలనుకున్నారు. ఖమ్మంలో మాత్రం పెట్టగలిగారు. తర్వతా ఒక్కటంటే ఒక్కటీ ఆచరణలోకి రావడం లేదు. నెలాఖరులో కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తున్నారు. కానీ ఎలాంటి బహిరంగసభ పెట్టడం లేదు. చిన్న ప్రసంగంతో సరి పెడుతున్నారు. మొదటి సారి సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు చేసినప్పుడు దేశంలో ఉన్న బీజేపీయేతర ముఖ్యమంత్రులందర్నీ పిలిచారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభను కూడా ప్రకటించారు. కానీ చివరి క్షణంలో వాయిదా వేశారు ఆ తర్వాత ఇక సభల జోలికి పోవడం లేదు.
ఖమ్మంలో బహిరంగసభ నర్వహించిన తర్వాత కనీసం నెలకు ఓ బహిరంగసభ ద్వారా జాతీయ నేతల ఐక్యతను ప్రదర్శిచాలని కేసీఆర్ అనుకున్నారు. కేసీఆర్ పిలిస్తే వచ్చేందుకు కొంత మంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. కానీ వారు కేసీఆర్ తో కలిసి నడుస్తామని మాత్రం చెప్పడం లేదు . బీజేపీని వ్యతిరేకిస్తామని చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు.. ఈ మధ్యలో ఏం జరిగిందో కానీ జాతీయ నేతలు అసలు కేసీఆర్ ను పరిగణనలోకి తీసుకోవడం మానేశారు. స్టాలిన్ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలో బీజేపీయేతర రాజకీయ నేతలందర్నీ పిలిస్తే.. కేసీఆర్ ను మాత్రం మర్చిపోయారు
నితీష్ కుమార్ ఇతర పార్టీల్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ కేసీఆర్ దాకా రావడం లేదు. బీఆర్ఎస్ విషయంలోకేసీఆర్ తాను మహారాష్ట్ర వరకే దృష్టి సారిస్తున్నారు. ఇతర చోట్ల అసలు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఇలా కేసీఆర్ రాజకీయ వ్యూహాలు కిందా మీదా పడటం ఇబ్బందికరమే. జాతీయ స్థాయిలో కేసీఆర్ నిలబడుతున్నారని.. అందరూ మద్దతిస్తున్నారని తెలంగాణ ప్రజలూ అండగా ఉండాలని ఆయన ప్రజల్ని కోరాలనుకుంటున్నారు. కానీ ముందుగానే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.