దాదాపుగా ఏడాది కిందట కరోనా విజృంభణకు ముందు టీఆర్ఎస్లో కలకలం రేగింది. దీనికి కారణం ఈటల రాజేందర్. ” కొడకా..టీఆర్ఎస్కు ఓనర్లం ఏమనుకుంటున్నావో” … ప్రభుత్వ పెద్దలకు చెందినదిగా భావిస్తున్న ఓ పత్రిక రిపోర్టర్‌కు ఇచ్చిన వార్నింగ్ సంచలనం అయింది. ఈటల బీసీ కాబట్టే మంత్రి పదవి వచ్చిందని..లేకపోతే అది కూడా రాకపోయి ఉండె అని..ఆ పత్రిక రాయడమే ఈటల కోపానికి కారణం. తనకు మంత్రి పదవి ఉత్తినే రాలేదని… ఉద్యమంలో పని చేశాం కాబట్టే వచ్చిందని ఆయన చెప్పకనే చెప్పారు. అప్పుడే.. ఈటలకు పార్టీకి మధ్య గ్యాప్ ఏర్పడింది. కానీ కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా ఈటల యాక్టివ్ అయ్యారు. తరచూ ప్రగతి భవన్లో సమీక్షకు హాజరయ్యేవారు. కేసీఆర్‌తో కలిసి సమీక్షా సమావేశాలు పెట్టేవారు. అయితే… కరోనా ప్రభావం తగ్గే కొద్ది మళ్లీ ఆ గ్యాప్ పెరగడంప్రారంభించింది.
ఇటీవలి కాలంలో ఈటలను కేసీఆర్ చాలా దూరం పెడుతున్నారు. పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్నా.. ఎలాంటి బాధ్యతలు ఇవ్వడంలేదు. ఇలాంటి సమయంో… తన నియోజకవర్గంలోని ఓ కార్యక్రమంలోఆయన చేసి వ్యాఖ్యలు మళ్లీ కలకలం రేపాయి. పథకాల్ని కాదని… మంచి చేసేమనుషుల్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు.. పార్టీపై తిరుగుబాటు చేస్తున్నట్లుగా.. పార్టీకి సంబంధం లేకుండా తనను గుర్తుపెట్టుకోవాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో మళ్లీ గ్యాప్ పెరిగిపోయిందని అనుకున్నారు.అయితే అనూహ్యంగా మంత్రి కేటీఆర్ స్వయంగా… ఈటల రాజేందర్ ను వెంట బెట్టుకుని ప్రగతి భవన్లో సమీక్షకు వెళ్లారు. కరోనాపై ముఖ్యమంత్రి జరిపిన సమీక్,లో పాల్గొన్నారు.
ఇటీవల ఈటల కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈటల మాటలు.. చేతలు ఆసక్తికర చర్చకు కారణం అవుతున్నాయి.ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఫలితంగా… మరోసారి కేసీఆర్‌తో ఈటల సన్నిహితంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కేసీఆర్.. గతంలోలా లేరు. నాయకత్వ మార్పు అంశాన్ని పక్కన పెట్టేసినట్లుగానే కనిపిస్తోంది కాబట్టి.. ఈటలను కూడా ఎప్పట్లా దగ్గరగానే ఉంచుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఈటల వివాదానికి కూడా క్లోజ్ చేసే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.