ఎప్పుడూ ఒకేలా ఉంటే అది రాజకీయం ఎలా అవుతుంది చెప్పండి! ఇక్కడ శాశ్వత శత్రువులూ ఉండరు, మిత్రులూ ఉండరనే సూత్రం నిత్య సత్యం. కాంగ్రెస్ – టీడీపీ కలుస్తాయని ఎవరైనా అనుకున్నారా..? గత ఎన్నికల్లో జరగలా..! సడెన్ గా ఈ చర్చ ఇప్పుడు ఎందుకంటే… తెలంగాణలో కూడా ఆ సూత్రమే మరోసారి నిజమయ్యే అవకాశం భవిష్యత్తులో ఉంటుందని చెప్పేందుకు కావాల్సిన పునాదులు పడుతున్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది కాబట్టి!
తెలంగాణలో తెరాస వెర్సెస్ కాంగ్రెస్… ఈ రెండే పోటీ అనుకున్నాం. మూడో ప్రత్యామ్నాయం ఉండకుండా చేయాలన్న ఉద్దేశంతో ఫస్ట్ టెర్మ్ లో టీడీపీని ఖాళీ చేయించారు కేసీఆర్ అనడంలో సందేహం లేదు! ఇక, రెండో టెర్మ్ కి వచ్చేసరికి… కాంగ్రెస్ కూడా ఎందుకూ, ఉంటే మనమే ఉండాలి, మరొకరంటూ ఉంటే ఏనాటికైనా ఏకుమేకై బలపడే ప్రమాదం అంటూ ఉంటుంది కదా అనే వ్యూహంతో ఆ పార్టీని కూడా ఖాళీ చేయించేశారు! సీఎల్పీని తెరాస ఎల్పీలో విలీనం చేసేసుకున్నారు. బిందాస్… మనల్ని కొట్టేటోడు లేడు అనుకున్న టైంలో నాలుగు ఎంపీ సీట్లు గెల్చుకుని భాజపా మే హునా అంటూ తెరమీదికి వచ్చింది. ఓరకంగా, కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసి… దాని స్థానంలో భాజపా బలపడేందుకు కావాల్సిన పొలిటికల్ వేక్యూమ్ ని కేసీఆర్ తయారు చేసి పెట్టారనే చెప్పాలి. ఇప్పుడా వేదికను భాజపా బాగా వాడేసుకుంటూ… తెరాసకు ప్రత్యామ్నాయం తామే కావాలనే పట్టుదలతో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీ ఉంది. ఏమీ లేని రాష్ట్రాల్లోనే ఆడేసుకుంటే, ఈ మాత్రం గ్రౌండ్ దొరికితే భాజపా ఊరకుంటుందా?
రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఏంటో కాస్త ఆలోచిస్తే స్పష్టంగా అర్థమైపోతోంది. తెరాస వెర్సెస్ భాజపా అన్నట్టుగానే పరిస్థితి ఉంటుందనే అనిపిస్తోంది. అంటే, బలమైన జాతీయ పార్టీతో కేసీఆర్ ఢీకొనాల్సి వస్తుంది. ఆ పరిస్థితే వస్తే.. తెరాసకు ఉన్న బలం సరిపోతుందా..? సరిగ్గా ఇదే చర్చ ఇప్పుడు తెరాస వర్గాల్లో చిన్నగా మొదలైనట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉంటేనే తమకు బాగుంటుందనీ, కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా మనమే చేశాం కదా అనే వ్యాఖ్యలు ఈ మధ్య కొంతమంది నేతల మధ్య చర్చకు వచ్చాయట. ఈ సందర్భంలోనే ఓ ప్రతిపాదన ప్రాథమికంగా మొగ్గ తొడిగింది. తెరాస, కాంగ్రెస్ కలిసి పనిచేస్తే… తప్పేముంది, గతంలో కూడా చేశాయి కదా! తెలంగాణలో భాజపా మరింత బలపడితే కాంగ్రెస్ కీ గడ్డు పరిస్థితే వస్తుంది కదా! అలాంటప్పుడు, కాంగ్రెస్ తెరాస కలిసి ముందుకు సాగితే… బాగుంటుందేమో అనే ప్రతిపాదన తెరమీదికి వస్తున్నట్టు తెలుస్తోంది. అదెలా కుదురుతుందీ అని ఇప్పుడు అనిపించొచ్చు. కాంగ్రెస్ మీద కేసీఆర్ దుమ్మెత్తి పోసే కదా మొన్నటి ఎలక్షన్లలో గెలిచిందీ అనిపించొచ్చు. కానీ, అదే తప్పదని కేసీఆర్ భావిస్తూ… మనం చూస్తుండగానే శత్రువులు మిత్రులై, మిత్రుడిగా ఉంటాడనుకున్న కొత్త శత్రువుపై తెరాస పోరాటం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు! ఏదైతేనేం.. ఇదో ఆప్షన్ ఉంటుందనే ఒక చర్చకి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీజం పడింది.