తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణకు వస్తున్న ఆదాయం .. ఖర్చులకు సరిపోకపోతూండటంతో మద్యంపై మరింత మొత్తం బాదేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున మద్యం ధరలు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఫుల్ బాటిల్‌పై రూ. ఎనభై వరకూ వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. జీతాలను కూడా సమయానికి ఇవ్వలేకపోతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా అప్పులను నిలిపివేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ సర్కార్ పడింది. ఉద్యోగులకు జీతాల్లో కొంత కాలం కోత విధించాలన్న ఆలోచన కూడా చేసింది. కానీ రానున్నది ఎన్నికల కాలం కావడంతో విరమించుకున్నారు. ఆదాయం పెంచడానికి మద్యంపై ధరలు పెంచడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు . కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ విధించి.. ఎత్తేసిన తర్వాత ధరలు పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
అప్పట్లోనూ దాదాపుగా ఇరవై శాతం పెంచారు. ఇప్పుడు కూడా దాదాపుగా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు ఇప్పటి వరకూ తక్కువగానే ఉండేవి. కానీ ఇటీవల ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను కాస్త తగ్గించింది. ఇప్పుడు తెలంగాణ పెంచుతోంది. ఈ కారణంగా రెండు రాష్ట్రాల్లో మద్యం ధరల మధ్య తేడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో మాత్రం అన్ని రకాల బ్రాండ్లు లభిస్తున్నాయి. ఏపీలో మాత్రం ఫర్ సేల్ ఆంధ్రా ఓన్లీ బ్రాండ్లు మాత్రమే లభిస్తాయి.