రీ డిజైన్ల పేరుతో కేసీఆర్ సృష్టించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం. లక్ష కోట్లకుపైగా ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్ట్. ఇప్పుడీ ప్రాజెక్ట్ పై విస్తృతమైన చర్చ ప్రారంభమయింది. ప్రపంచంలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంగా చెప్పుకున్న భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నీటిలో మునిగిపోయింది. ప్రాజెక్టు పంపులు, మోటార్లు వరదలో చిక్కుకున్నాయి. వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కాళేశ్వరం మోటార్లు, పంపులన్నీ మునిగిపోవడంపై జనంలో చర్చ ప్రారంభమయింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌లను గోదావరి వరదలు ముంచెత్తాయి. మొత్తం 29 మోటార్లు మునిగిపోయాయి. ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఇంత జరిగినా అక్కడేం జరగనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉంటోంది. తాము స్పందిస్తే ఇంకా ఎక్కువ చర్చ జరుగుతోందని భావిస్తోంది. ఇరిగేషన్ విభాగం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నీట మునిగిన మోటార్లు మళ్లీ పని చేస్తాయా లేదా, పునరుద్ధరణ ఎప్పటికల్లా జరుగుతుందనే వివరాలనూ ప్రభుత్వం గోప్యంగా ఉంచటం ఈ భారీ ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి.
అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌ల పరిసరాల్లో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. పంపుహౌస్‌ల వైపునకు మీడియా వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులతో అడ్డుకుంటున్నారు. డీ వాటరింగ్ కోసం నియమించిన సిబ్బందితోపాటు ఇరిగేషన్ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తప్పా ఇంకెవ్వరినీ పంపుహౌస్‌ల దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. కాళేశ్వరం నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం లేదన్నట్లు, సర్కారు వైఫల్యం కాదని చెబుతున్నారు. భారీగా వరదలు వచ్చాయంటున్నారు. అయితే దేవాదుల ప్రాజెక్టు మునగక పోవడం ప్రభుత్వం తప్పు చెబుతోందన్న అభిప్రాయానికి కారణం అవుతోంది. దేవాదులలో వరద ఉధృతి ఇంకా ఉన్నప్పటికీ మోటార్లు, పంపులు మునగకపోవడం.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సర్కారు చెబుతున్నవి అబద్దాలన్న వాదనకు కారణం అవుతోంది.
ఈ అంశాన్ని మరుగుపర్చడానికి క్లౌడ్ బరస్ట్, భద్రాచలం వంటి అంశాలను తెరపైకి తెచ్చినా ఆ ప్రాజెక్ట్ విషయంలో ప్రజలు ఆసక్తి చూపకుండా ఉండరని భావిస్తున్నారు. ఇది కేసీఆర్‌కు కొత్త కష్టాలు తెచ్చి పెడుతోంది.