తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కీలకమైన సమావేశాలకు హాజరవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అనారోగ్యం పేరుతో దూరంగా ఉండటానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా కేసీఆర్ సిక్ లీవ్ పెట్టేశారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ఆ బాధ్యత తీసుకున్నారు. సీఎస్ సోమేష్ కుమార్ కూడా పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరూ వెళ్లి… వివరాలను చెప్పారు. స్వల్ప అనారోగ్యం కారణంగా కేసీఆర్ సమావేశంలో పాల్గొనలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత ఓ సారి గడ్కరీ మీటింగ్ నిర్వహించారు. ఆ సమావేశానికి కేసీఆర్ వర్చ్యువల్‌గా హాజరు కాలేదు. తెలంగాణ తరపున హాజరైన ప్రతినిధులు.. తమ సీఎంకు అనారోగ్యం అని అందుకే రాలేదని గడ్కరీకి చెప్పారు. దాంతో గడ్కరీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అప్పటి వరకూ కేసీఆర్‌కు అనారోగ్యమని ఎవరికీ తెలియదు. కానీ.. గడ్కరీకి తెలియదమో కానీ… అది ..సమావేశానికి డుమ్మా కొట్టేందుకు వచ్చిన అనారోగ్యమని కొంత మంది సైటెర్లు వేశారు.
నిజానికి నీతి ఆయోగ్ సమావేశం వల్ల పైసా ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రుల భావన. గతంలో పంచవర్ష ప్రణాళిక ఉండేది. అప్పట్లో నిధులు నేరుగా రాష్ట్రాలకు ఇచ్చేవారు. ప్రణాళికల స్థానంలో నీతి ఆయోగ్ ను తీసుకు వచ్చారు. నీతి ఆయోగ్ కు.. ఎలాంటి ఆర్థిక అధికారాలు లేవు. ఈ కారణంగా ఏదైనా మంచి పనులు చేసినప్పుడు సిఫార్సులు మాత్రమే నీతి ఆయోగ్ చేయగలుగుతుంది కానీ నిధులు విడుదల చేయడం లేదు. తెలంగాణకు సంబంధించినంత వరకు మిషన్ భగీరధ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. కానీ కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే ఉపయోగం ఉండదని కేసీఆర్ సమయం వృధా చేసుకోలేదని అంటున్నారు.