హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మెదక్ జిల్లా సిద్దిపేటలో ఏర్పాటుచేసిన హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ దీక్ష స్ఫూర్తి పైలన్ను, హరితహారం జెండాను ఆవిష్కరించి మొక్కలు నాటారు. అనంతరం అక్కడ బహిరంగసభలో మాట్లాడారు. తాను సిద్దిపేట నర్సరీలో మొలిచిన మొక్కనని అన్నారు. తాను ఎక్కడికి పోయినా సిద్దిపేటనుమాత్రం మరిచిపోనని, వజ్రాలుపెట్టి కొనుక్కున్నా సొంత ఊరు ప్రేమమాత్రం దొరకదని వ్యాఖ్యానించారు. మంత్రి హరీష్రావు హుషారుగా ఉన్నాడని అన్నారు. గోదావరి నీళ్ళు, రైలు మార్గం, కొత్త జిల్లా అనే మూడు పనులను సిద్దిపేటకు చేయాల్సిఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు త్వరలో శంకుస్థాపన చేస్తానని అన్నారు.