హైదరాబాద్: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తన మంత్రుల బృందాన్ని కూడా ఆ దిశలో తయారుచేస్తున్నారు. ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానంలో వెనకబడిఉన్న తన మంత్రులకు ట్యూషన్ చెప్పిస్తున్నారు. 18మంది సభ్యులున్న ప్రస్తుత క్యాబినెట్లో కేసీఆర్, కేటీఆర్‌లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఇంగ్లీష్‌లో మాట్లాడగలుగుతారు. హైదరాబాద్‌లో విదేశీ ప్రముఖులు పాల్గొనే సభలు, సమావేశాలలో మాట్లాడటానికి చాలామంది మంత్రులు నోరువెళ్ళబెడుతున్నారు. తమ మంత్రిత్వశాఖల పనులలోకూడా అధికశాతం పనులకోసం బ్యూరోక్రాట్లపై ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి, ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించటంతోబాటు, కంప్యూటర్ పరిజ్ఞానంకూడా నేర్చుకోవాల్సిందేనని మంత్రులకు ఆదేశాలిచ్చారు. స్వయంగా ఆయనకూడా ఈ రెండింటినీ నేర్చుకుంటూ తన సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత ఏడాదికాలంలో ఆయన ఆంగ్లభాషా పరిజ్ఞానం గణనీయంగా పెరిగిందని సీఎమ్ కార్యాలయవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన టీఎస్-ఐపాస్ సదస్సులో తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటించే సమయంలో, గత బుధవారం సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలతో సంభాషణలో కేసీఆర్ వాడిన ఆంగ్ల భాషను దీనికి ఉదాహరణగా ఉటంకిస్తున్నారు.
కేసీఆర్ కరాఖండిగా చెప్పటంతో తప్పేదిలేక ఆంగ్లంలో వీక్‌గా ఉన్న మంత్రులందరూ వ్యక్తిగతంగా ట్యూటర్లను పెట్టుకుని పాఠాలు చెప్పించుకోవటం ప్రారంభించారు. అటవీశాఖమంత్రి జోగు రామన్న, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోమ్ మంత్రి నాయని, టూరిజం మంత్రి చందూలాల్ ఈ జాబితాలో ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, పాలనాపరమైన మెళుకువల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మెరుగుపడాలని ముఖ్యమంత్రి బాగా పట్టుదలగా ఉన్నారని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. త్వరలో ఈ విషయంలో ఒక ట్రైనింగ్ సెషన్ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లీష్ ట్యూషన్లో జూపల్లి కృష్ణారావు ముందంజలో ఉన్నారని చెబుతున్నారు. పరిశ్రమలశాఖ నిర్వహిస్తున్న ఆయన ఇటీవల వివిధ సదస్సులలో పారిశ్రామికవేత్తలతో, డెలిగేట్లతో ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతున్నారట. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రం తరపున మాట్లాడాల్సివచ్చినపుడు ఇంగ్లీష్‌లో మాట్లాడితేనే మన భావాలను ప్రభావవంతంగా చెప్పగలమని జూపల్లి అంటున్నారు.
మొత్తంమీద పాలనాపరంగా కేసీఆర్ తీసుకుంటున్న మంచి చర్యలలో ఇదొకటని చెప్పొచ్చు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకూడా ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుంది. ఆయన ఎక్కడైనా ఇంగ్లీష్‌లో మాట్లాడాల్సివస్తే, ‘వాట్ ఐయామ్ టెల్లింగ్ ఈజ్’ అనే పదం తప్పించి మిగతాదంతా మ్మెమ్మెమ్మె అనటమే అని సోషల్ మీడియాలో ఇప్పటికే విమర్శలు బాగా వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.