అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా హైదరాబాద్ వచ్చారు. పని పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. అంతే బయట రాజకీయం మాత్రం గుప్పుమంది. బీజేపీ -టీఆర్ఎస్ ఒక్కటేనని గల్లీలో పోరాటం.. ఢిల్లీలో ఆరాటం అని ప్రచారం ప్రారంభించారు. నిజానికి ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ తక్కువే చేసింది. కానీ అంతర్గతంగా టీఆర్ఎస్ నేతలు చేసే ప్రచారం మాత్రం ఓ రేంజ్లో ఉంది. ఈ తీవ్రత ఎక్కువగా ఉందని .. జ్యోతిరాధిత్య సింధియాకు కూడా వెంటనే సమాచారం వచ్చినట్లుంది. సమావేశం ముగిసిన తర్వాత ఆయన స్పందించి.. రాజకీయాలకు సంబంధం లేదని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పుకోవాల్సి వచ్చింది.
టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం తామేనని, ఆ పార్టీతో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తాము ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నామని, వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం ఉంచుతారన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో లంచ్ సందర్భంగా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ విమానాశ్రయాల గురించి మాత్రమే చర్చించినట్లు సింధియా తెలిపారు. కేసీఆర్‌తో ఎలాంటి రాజకీయ అంశాలూ ప్రస్తావనకు రాలేదని ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాల్సి వచ్చింది. అయితే సింధియా వచ్చి కేసీఆర్‌తో సమావేశమైన విషయంపై జరిగినంత ప్రచారం… బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనేందుకు వస్తున్న కేంద్రమంత్రులు, ఇతర ముఖ్య నేతలు కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలకు లభించడం లేదు.
ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీ శ్రేణుల్ని గందరగోళంలోకి పంపేశారు. బీజేపీతో టీఆర్ఎస్ సన్నిహితంగానే ఉంటోందన్న సంకేతాలను పంపేందుకు కేసీఆర్ ప్రయత్నించారన్న అభిప్రాయం వినిపించింది. దీంతో బీజేపీ పోరాటంలో సీరియస్ నెస్ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎదుర్కోలేక బీజేపీ నేతలు ఇబ్బంది పడుతున్నారు.