టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో బీజేపీ పెట్టుకున్న ఆశలకు కేసీఆర్ ప్లాన్డ్గా గండి కొట్టారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక భారతీయ జనతా పార్టీ నేతలు.. చివరికి తమకు చెప్పకుండా నామినేషన్ వేసేసిన కంకణాల నివేదికతా రెడ్డికే టిక్కెట్ ఖరారు చేసి.. బీఫాం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే టీఆర్ఎస్లో పోటీ దారులు ఎక్కువగా ఉన్నారు. తేరా చిన్నపరెడ్డి, కోటిరెడ్డి ఇద్దరూ అక్కడ ప్రభావం చూపగల నేతలే. గతంలో తేరా చిన్నపరెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి జానారెడ్డిని ఓడించినంత పని చేశారు. స్వల్ప తేడాతో జానారెడ్డి గట్టెక్కారు. ఆయనకు జానారెడ్డిని ఓడించాలన్న లక్ష్యం కూడా ఉంది. టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
అయితే… నాగార్జున సాగర్‌లో పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఆయనతో బీజేపీ చర్చలు కూడా జరిపినట్లుగా ప్రచారం జరిగింది. అలాగే కోటిరెడ్డితోనూ బీజేపీ టచ్‌లోకి వెళ్లింది. బీజేపీకి బలమైన నేతలు లేకపోవడంతో.. టీఆర్ఎస్ అసంతృప్తులపైనే ఆశలు పెట్టుకుంది. ఈ విషయం కనిపెట్టిన కేసీఆర్… టిక్కెట్‌ను నోముల భగత్‌కు కన్ఫర్మ్ చేసినా బయట పెట్టలేదు. నాన్చారు. చివరికి చిన్నపరెడ్ిడ, కోటిరెడ్డిలను పిలిచి మాట్లాడి బుజ్జగించి… భగత్‌కు టిక్కెట్ ఖరారు చేశారు. ఒక్క రోజు ముందు చిన్నపరెడ్డి, కోటిరెడ్డి కూడా… బీజేపీలోకి జంపయ్యే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. సాగర్‌లో ఎలాంటి క్యాడర్ లేని బీజేపీని నమ్ముకుని ఆ పార్టీలోకి వెళ్తే మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ నేతలు వారికి కల్పిస్తున్నారు.
ఇక చివరి క్షణంలో వీరిద్దరూ మనసు మార్చుకుంటే తప్ప… బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదితారెడ్డికే బీఫాం ఇస్తారు. చిన్నపరెడ్డి అయినా కోటిరెడ్డి అయినా బీజేపీ తరపున పోటీకి ఆసక్తి చూపి.. బీజేపీలో చేరితే… వారికి చాన్సిచ్చే అవకాశం ఉంది. కానీ బీజేపీకి ఉన్న క్యాడర్ సహకరించే పరిస్థితి ఉండదు. వారిని సర్దుబాటు చేసుకునే సమయం కూడా ఉండదు. ఎలా చూసినా ఎన్నికలకు ముందే కేసీఆర్ ..బీజేపీని మాస్టర్ స్ట్రోక్ కొట్టారని అనుకోవచ్చు.