పూజలు చేసే పంతుళ్లయినా… బిర్యానీ అయినా… చివరికి వ్యవసాయం అయినా సరే ఆంధ్రా అంటే.. వ్యతిరేకంగానే ఆలోచించే ప్రకటనలు చేసే.. తెలంగాణ సీఎం కేసీఆర్ అనూహ్యంగా ఓ ఆంధ్రా రైతుకు ఫోన్ చేశారు. మీరు భలే వ్యవసాయం చేస్తున్నారు. ముచ్చటేస్తోంది.. త్వరలో కారు పంపిస్తాను. మా ఫామ్‌హౌస్‌కి వచ్చి భోజనం చేసి ఓ పూట ఉండి వెళ్లాలని ఆహ్వానించారు. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడంటే.. కొత్త పద్దతిలో వరి పండించాడు. సన్నాల బియ్యాన్ని పండించాడు. అది కేసీఆర్‌కు ఎలా తెలిసిందో కానీ..ఫోన్ చేశారు.
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఉప్పల ప్రసాదరావు అనే రైతుకు తెలంగాణ సీఎంవో నుంచి హఠాత్తుగా ఫోన్ వచ్చింది. కేసీఆర్ మాట్లాడతారని చెప్పి ఫోన్ చేశారు. కేసీఆర్ ఉప్పల ప్రసాదరావు చేసిన సీడ్రిల్ అనే ఆధునిక వ్యవసాయ యంత్రాలతో చేసిన సాగు.. వెద అనే పద్దతిలో చేసిన సన్నాల పంట సాగు..వంటి వాటి వివరాలు తెలుసుకున్నారు. కేసీఆరే ఫోన్ చేయడంతో ఆ రైతు పొంగిపోయారు. 40-45 బస్తాలు దిగుబడి సాధించానని ప్రసాదరావు తెలిపారు త్వరలో కారు పంపిస్తానని, తెలంగాణలో వ్యవసాయ పద్ధతులు పరిశీలించాలని, ఒకపూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ప్రసాదరావుకు కేసీఆర్ ఆహ్వానం పలికారు.
కేసీఆర్ సాదాసీదాగా ఫోన్లు చేయరు. ఏదో లెక్క ఉంటుంది. రెవిన్యూ సంస్కరణలు చేపట్టాలనుకున్నప్పుడు … ఆ సమస్యను ఎక్స్ పోజ్ చేయడానికి ఓ రెవిన్యూ బాధితుడుకి ఫోన్ చేశారు. ముంపు సమస్యలు ఉన్న ప్రాజెక్టుల నిర్వాసితులకు.. ఫోన్లు చేస్తూంటారు. ఆయన ఫోన్ చేసిన ప్రతీ సారి.. ఏదో ఓ డెలవప్మెంట్ ఉంటుంది. అంటే.. ఏపీ రైతుకు కేసీఆర్ ఫోన్ వెనుక.. ఏదో కీలకమైన నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఇక్కడ అసలు విషయం… ఏపీలో రైతుకు కేసీఆర్ ఫోన్ చేసింది..సన్నాల రకం వరి పంట గురించి.. ఈ సన్నాల రకం వరి మద్దతు ధరపైనే తెలంగాణలో రచ్చజరుగుతోంది. కేసీఆర్ చెప్పారని విపరీతంగా పండించి.. రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఆంధ్రా రైతుకు కేసీఆర్ ఫోన్ వెనుక ఈ లింక్ ఏమైనా ఉందా అన్నచర్చ ఇప్పుడు.. తెలంగాణలో ప్రారంభమయింది.