హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయుత చండీయాగానికి ఆహ్వానించటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉన్న ఉండవల్లిలోని హెలిప్యాడ్‌లో కేసీఆర్ ఛాపర్ ల్యాండ్ అయ్యింది. కేసీఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు యనమల, చినరాజప్ప, రావెల కిషోర్ బాబు వారికి స్వాగతం పలికారు. ఛాపర్నుంచి దిగి అక్కడ ఏర్పాటుచేసిన వాహనంలో చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఇంటివద్ద బయటే నిలుచున్న చంద్రబాబు కేసీఆర్‌కు పుష్పగుఛ్ఛంతో స్వాగతం పలికారు. కేసీఆర్‌కు శాలువా కప్పి సత్కరించారు. లోపలికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ చంద్రబాబును శాలువా కప్పి సత్కరించి తర్వాత ఆయుత చండీయాగానికి ఆహ్వానపత్రికను, నూతన వస్త్రాలను, స్వీట్స్, పళ్ళు, పూలు ఇతర కానుకలను ఇచ్చారు. మీడియా ముందటే ఇరు రాష్ట్రాల నేతలూ ముచ్చటించుకున్నారు. గతంలో మనపార్టీలో ఉన్నప్పుడు కూడా యాగం చేశారు కదా అని చంద్రబాబు కేసీఆర్‌ను అడిగారు. అవునని, కానీ అప్పుడు మీడియా హడావుడి లేదుకాదా అని కేసీఆర్ చమత్కరిస్తూ, ప్రస్తుత యాగ విశిష్టతను తెలియజేశారు.
మరోవైపు కేసీఆర్, రాజేందర్, సుమన్‌లకు ఆంధ్రా ప్రత్యేక వంటకాలతో చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ విందులో కేసీఆర్‌కు ఇష్టమైన నాటుకోడి కూర, రొయ్యల ఇగురు, చేపల పులుసు, ఉలవచారు బిర్యానీ, గోంగూర, క్యారెట్ బొబ్బట్లు, కాకినాడ కాజా తదితర 15 ప్రత్యేక వంటకాలను విజయవాడకు స్వీట్ మ్యాజిక్ హోటల్‌కు చెందిన షెఫ్‌లతో చేయించారు.