తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతలు బంగారు తెలంగాణ దిశగా సాగడం లేదు. ప్రభుత్వమంటే ప్రజాధనానికి కాపలాదారు. కానీ, దాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ ఇదివరకటి ముఖ్యమంత్రుల రికార్డులను బద్దలు కొడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముంగిట, రాజధానిలో విద్యుత్తు, మంచినీటి చార్జీలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎందకీ నిర్ణయం?
ఓట్ల కోసం పన్నుల ఎగవేతను ప్రోత్సహించే నిర్ణయాలు చేయడం తీవ్రమైన బాధ్యతారాహిత్యం ఇంతకీ, ప్రతినెలా ఠంచనుగా కరెంటు బిల్లు, నల్లా బిల్లు కట్టే పౌరులకు కేసీఆర్ ఏ సందేశం ఇచ్చినట్టు? బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వానికి సహకరించేలా సకాలంలో బిల్లులు, పన్నులు చెల్లించడం తప్పు అనా? అలా చెల్లించిన వారు పిచ్చివాళ్లనా? బిల్లు చెల్లించని వారే చాలా గొప్పవాళ్లనా?
తరచూ కేసీఆర్ వ్యవహారశైలి ప్రజాస్వామ్య విరుద్ధంగా కనిపిస్తోంది. ఇష్టారాజ్యం చెలాయించినా ఎవరూ అడగకూడదనే ధోరణి వ్యక్తమవుతోంది. 128 కోట్ల విద్యుత్ బిల్లులు, 290 కోట్ల రూపాయల నల్లా బిల్లులను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంత భారీ మొత్తం ఖజానాకు రాకుండా పోవడం బాధ్యతాయుతమైన నిర్ణయమా? ఆ నిధులతో విద్యుత్, మంచినీటి వ్యవస్థలను పటిష్టం చేయడానికి, మరో విధంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడా అవకాశం లేదు. అయినా, ఎగవేతను ప్రోత్సహించేలా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్యబద్ధమేనా అనేది తెలంగాణ మేధావులు ఆలోచించాల్సిన విషయం.
కేసీఆర్ ఒక్కోసారి దేవుడిగా కనిపిస్తారు. మరోసారి కఠిన హృదయుడిలా ప్రవర్తిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు అడిగిన మేరకు, అడిగిన దానికంటే ఎక్కువగా జీతాలు పెంచారు. తాను చెప్పిన వెంటనే సమ్మె విరమించలేదనే అక్కసుతో వేల మంది పారిశుధ్య సిబ్బంది ఉన్న కొలువు లేకుండా చేసేశారు. వాళ్లంతా హటాత్తుగా రోడ్డున పడ్డారు. చివరకు కోర్టు ఆదేశంతో వారిని ఎలాగూ విధుల్లో చేర్చుకోక తప్పలేదు.
వేతనాలు పెంచాలని ఆశా వర్కర్లు చాలా కాలంగా సమ్మె చేస్తున్న కేసీఆర్ మనసు కరగడం లేదు. పైగా, వారిని అవమానిస్తూ, కసురుకుంటూ కేసీఆర్ కేబినెట్లోని జగదీష్ రెడ్డి తదితర మంత్రులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నా కేసీఆర్ కు చీమకుట్టినట్టయినా లేదు.
మరోవైపు, రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. రుణమాఫీతో సమస్య తీరలేదు. రైతులను ఆదుకోవడానికి ఏంచేయాలి, అవసరమైతే ప్రభుత్వం తరఫున కార్పస్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేయాలా అనే ఆలోచన లేదు. పత్తి రైతులు దళారులు దోచుకుంటున్నా పట్టించుకునే దిక్కులేదు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడం, మిషన్ కాకతీయ, జలహారం, హరిత హారం వంటి వినూత్న పథకాలతో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ , ప్రజా ధనం విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యకరం. అందులోనూ, ఎగవేతను ప్రోత్సహిస్తే ఇక ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బిల్లులు కట్టం మానేస్తే? ప్రభుత్వం మాఫీ చేస్తుందని గమ్మునుంటే? అప్పుడు వచ్చే సంక్షోభానికి ఎవరు బాధ్యులవుతారు?