తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నీటి పారుదల శాఖ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు.. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నీటి పారుదల శాఖ వ్యవహారం లోపభూయిష్టంగా ఉందని అనుకుంటున్న సీఎం.. దాన్ని సంపూర్ణంగా మార్చడానికి.. తనదైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆ శాఖపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. అందులోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రాజెక్టుల రీడిజైన్ చేశారు. ఫలితంగా.. తెలంగాణలో సాగునీటి సౌకర్యం పెరిగింది. సాగు కూడా.. భారీగా పెరిగింది. చెరువులు కూడా బాగుపడటంతో.. రైతులు కూడా.. ఆనందంగా ఉన్నారు.
తెలంగాణలో వ్యవసాయ దిగుబడి కూడా అధికంగా ఉంది. దేశం మొత్తం మీద ధాన్యం దిగుబడిలో తెలంగాణ నుంచే 55 శాతం ఉంది. రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా … నియంత్రిత సాగు విధానాన్ని కూడా కేసీఆర్ ప్రవేశ పెట్టారు. ఇలాంటి సమయంలో.. సాగునీటి శాఖను పూర్తిగా సంస్కరించి బలోపేతం చేసి.. నిరంతరాయంగా రైతులకు నీరు అందేలా వ్యవస్థ సిద్ధం చేస్తే.. బాగుంటుందంని.. కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం నీటిపారుదలశాఖ భారీ, మధ్యతరహా, చిన్నతరహా, ఐడీసీ, ప్రాజెక్టులు .. ఇలా వేర్వేరుగా ఉంది. అన్నింటినీ కలిపి ఒకే విభాగం కిందకు తెస్తే.. పర్యవేక్షణాలోపం ఉండదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
నీటి పారుదల శాఖ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి.. ఒక్కో విభాగానికి ఒక్కో ఉన్నతాధికారిని నియమిస్తారు. ఆ ఉన్నతాధికారి పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు ఉంటాయి. పర్యవేక్షణను ఆ అధికారే చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల గందరగోళం తగ్గిపోతుంది. నీటి నిర్వహణ సులువు అవుతుంది. ఇప్పటి వరకూ.. చెరువులు.. కాలువలు.. రిజర్వాయర్లు వేర్వేరుగా ఉన్నాయి. కేసీఆర్.. సుదీర్ఘంగా నిపుణులతో మేధో మథనం చేసిన తర్వాత..ఈ వ్యవస్థలో మార్పులపై దృష్టి కనిపెట్టినట్లుగా తెలుస్తోంది. సమీక్ష తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి తెలంగాణ నీటి పారుదల వ్యవస్థలో మార్పులు మాత్రం ఖాయమని చెప్పుకోవచ్చు.