అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని చవిచూసిన బీఆర్ఎస్ భవిష్యత్ పై ఫోకస్ పెట్టనుంది. ఆలస్యం చేస్తే పార్టీకి మరిన్ని గడ్డు పరిస్థితులు తప్పవని భావిస్తోన్న గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ప్లీనరీ నిర్వహించి సర్కార్ విధానాలపై సమరానికి సమాయత్తం అవ్వాలని భావిస్తున్నారు. ఈమేరకు పార్టీ ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలి..? ఎన్ని రోజులు నిర్వహిద్దాం..? అని ఫామ్ హౌజ్ నుంచే కేసీఆర్ కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కారణంగా రెండేళ్లుగా బీఆర్ఎస్ ప్లీనరీని వాయిదా వేస్తూ వచ్చింది. వరుస ఎన్నికల ఓటములు పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేయడం.. కేసీఆర్ కూడా సైలెంట్ అవ్వడంతో క్యాడర్ లో నైరాశ్యం నెలకొన్నది. మరికొంతమంది నాయకులు భవిష్యత్ వెతుకులాటలో భాగంగా పార్టీలు మారుతున్నారు. ఇకనైనా కేసీఆర్ దూకుడు పెంచకపోతే మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించి పార్టీలో కొత్త జోష్ తీసుకురావాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. ప్లీనరీ వేదికగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల వైఫల్యంపై ఉద్యమ కార్యచరణను ప్రకటించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ప్లీనరీని హైదరాబాద్ లో నిర్వహించాలా…? వరంగల్ లో నిర్వహించాలా..? అన్న దానిపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని.. త్వరలోనే ముఖ్య నేతలతో భేటీ అయి ప్లీనరీ తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్లీనరీ తర్వాత మునుపటి కేసీఆర్ ను చూస్తారంటూ ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొంటూ కేసీఆర్ తనదైన మార్క్ పాలిటిక్స్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.