ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను సాధించడం ఆషామాషీ కాదు. ఒంటిచేత్తో చక్రం తిప్పడం చిన్న విషయం కాదు. తండ్రి అండ ఎంత ఉన్నా, ప్రచార రథాన్ని దూకుడుగా ముందుకు ఉరికించడం కత్తిమీద సామే. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ మ్యాజిక్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో కారు జోరుకు తిరుగు లేకుండా చేశారు. తెరాస హైదరాబాదులో గెలవని పార్టీ అనే ముద్రను చెరిపేశారు.
సమకాలీన రాజకీయాల్లో యువ నేతలు చాలా మందే ఉన్నారు. రాహుల్ గాంధీ, నారా లోకేష్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, జ్యోతిరాదిత్య సిందియా వంటి వారు ఎవరికీ కేటీఆర్ స్థాయిలో ట్రాక్ రికార్డ్ లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దశాబ్దంనరగా సాధించిన అద్భుతాలు ఏమీ లేవు. తన తల్లి పోటీచేసిన అమేథీలో ఆమె ప్రచార బాధ్యతలను రాహుల్ నిర్వహించారు. ఆమె విజయం సాధించడం ఆయన ఘనతే అని వీర విధేయులు సంబరాలు చేశారు. వారి కుటంబానికి కంచుకోట వంటి అమేథీ సీటును గెలవడం పెద్ద అద్భుతం ఏమీ కాదు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రచార సారథ్యం తీరుపై విమర్శలే తప్ప ప్రశంసలు లేవు.
నారా లోకేష్ కూడా అంతే. గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆయన ప్రసంగాలు ఆ పార్టీ వారికే మహా బోర్ కొట్టాయి. స్పష్టత లేని ప్రసంగాలు, పసలేని మాటలు, పదును లేని విమర్శలు, పక్కాగా లేని వ్యూహం… ఇలా ఎన్నో లోపాల కారణంగా తెలుగు దేశం కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. లోకేష్ ఘోర వైఫల్యానికి ఇదో నిదర్శనం.
యూపీలో అఖిలేష్ యాదవ్ సాధించిన అద్భుతాలూ ఏమీలేదు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోనే అధికారంలోకి వచ్చారు. తర్వాత తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని ములాయం భావించడంతో అఖిలేష్ కు అవకాశం లభించింది. గత నాలుగేళ్లలో అఖిలేష్ పాలన విమర్ళలు ఎక్కువ, ప్రశంసలు తక్కువ అనే విధంగా సాగుతోంది.
తమిళనాడులో డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు స్టాలిన్ ఆ మధ్య హడావుడి చేశారు. కాస్త యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా చెలామణి అయ్యారు. చెన్నై మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే తమిళనాడులో అధికార పార్టీ హవా ఉన్నప్పుడు ప్రతి ఎన్నికల్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతుంది. ప్రజల మూడ్ అలా మారిపోతుంది. కాబట్టి హైదరాబాదులో కేటీఆర్ మ్యాజిక్ తరహాలో స్టాలిన్ అద్భుతాలేమీ చేయలేదు. ఇక జ్యోతిరాదిత్య సిందియా వంటి వారు వంశం పేరు చెప్పుకొని తమ సీటును గెలవడం మినహా పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు.
మహారాష్ట్రలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే తనయుడు ఉద్ధవ్ థాకరే కూడా విజయాల సాధనలో వెనకబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనను అతిపెద్ద పార్టీగా నిలపలేక పోయారు. చివరకు బీజేపీకి తోకపార్టీగా శివసేన మారిపోయింది.
కేటీఆర్ మాత్రం ప్రచార బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. కొన్ని తాయిలాలు, ప్రజలను ఊరించే కొన్ని హామీలు, ఆశ కలిగించే కొన్ని నిర్ణయాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. నల్లా, కరెంటు బిల్లు బకాయిల మాఫీ వంటి తాయిలాల ప్రభావం ఉంది. అయినా, 150 డివిజన్లలో ప్రచార బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం, సమన్వయపరడం మామూలు విషయం కాదు. దాదాపు వంద మంది రెబెల్స్ ను బుజ్జగించి విత్ డ్రా అయ్యేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నికలోనూ విజయవంతమైన పాత్రను పోషించారు. ఇలా… ఇప్పటి రాజకీయ భారతంలో అద్భుత విజయాలను సాధించిన యంగ్ టైగర్ గా కేటీఆర్ ప్రశంసలు పొందుతున్నారు.