ఏం మారట్లేదు.. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసినట్లే కేసీఆర్ చేస్తున్నారు. ఎంతగా పోలికలు వద్దనుకున్నా అదే చేస్తున్నారు. ఇప్పుడు మోదీ పర్యటనకు స్కిప్ చేయడం .. మోదీ సభకు నిరసనలు వ్యక్తం చేయడం మాత్రమే కాదు.. చివరికి … దర్యాప్తు సంస్థల దాడులపై మీకు పోలీస్.. నాకు పోలీస్ అన్న తరహాలో ఎదురుదాడి చేస్తున్నారు. ఫామ్ హౌస్ కేసు ఫైల్స్‌తో కేంద్ర పెద్దలను కూడా ఇరికిస్తామన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే చేశారు.
టీడీపీ లాగే టీఆర్ఎస్ కూడా మొదట్లో బీజేపీతో సన్నిహితంగానే ఉండేది. కానీ ఇప్పుడు శత్రవయింది. టీడీపీ కూడా అంతే. ఉన్నంత కాలం బాగా ఉండి.. ఒక్క సారిగా రూటు మార్చారు. తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను ఏకం చేస్తానని చంద్రబాబు ఉబలాటపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారు. పెద్దగా కలసి రావడం లేదని నేరుగా జాతీయ పార్టీ పెడుతున్నారు. అప్పట్లో చంద్రబాబు కూడా ప్రతీ చిన్న దానికి మోదీని నిందించేవారు. ఇప్పుడు కేసీఆర్ అదే్ పని చేస్తున్నారు. బీజేపీని ఓడించితీరుతామన్న గట్టి నమ్మకంతో చంద్రబాబు ఉండేవారు. చంద్రబాబు కొంత మంది కోటరీ చెప్పిన మాటలతో నిజమని నమ్మేవారు. ఇప్పుడు కేసీఆర్‌దీ అదే్ పరిస్థితి. ఎవరు చెబుతున్నారో కానీ కేసీఆర్ మాత్రం బీజేపీని ఓడించడం ఖాయమని నమ్ముతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించినప్పుడు బీజేపీని ఓడించలేమా అంటున్నారు. కానీ అద్భుతాలు అన్నీ సార్లూ జరగవు. జరిగితే అద్భుతాలు కావు.
చివరికి సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసే విషయంలోనూ సేమ్ టు సేమ్.. వ్యవహరించారు. చంద్రబాబు చేసినట్లే చేశారు., అయితే ఇక్కడ కొసమెరుపేమిటంటే.. అప్పట్లో చంద్రబాబు చేసిన పనులను.. బీజేపీతో సన్యంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత ఎగతాళి చేసేవారు. సీబీఐ అనుమతి రద్దు చేయడంపైనా వెటకారం చేశారు. కానీ ఇప్పుడు అదే చేయాల్సి వస్తోంది. చంద్రబాబు చేసినట్లే అన్నీ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు ఆయనకు మద్దతుగా ఎవరూ రావడం లేదు. టీడీపీ నేతలు కూడా సెటైర్లు వేసుకుంటున్నారు. చివరికి ఫలితం చంద్రబాబులాగే వస్తే.. అప్పుడు ట్రోలింగ్‌కు అడ్డూ అదుపూ ఉండదు.