నిరుద్యోగుల ఆగ్రహం కంట్రోల్ చేయలేని విధంగా పెరుగుతోందని తెలంగాణ సీఎంకేసీఆర్ గ్రహించినట్లుగా ఉన్నారు. ఆయన ఉద్యోగాల భర్తీ ప్రకటన అసెంబ్లీ వేదికగా చేసే అవకాశం కనిపిస్తోంది. వనపర్తి జిల్లాలో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన కేసీఆర్ నిరద్యోగులకు టీజర్ వదిలారు. అద్భుతమైన విషయాన్ని చెప్పబోతున్నానని బుధవారం ఉదయం పది గంటలకు అసెంబ్లీ చూడాలని ఆయన పిలుపునిచ్చారు. మనం ఎలాంటి తెలంగాణ తయారు చేసుకున్నామో వివరిస్తానన్నారు. బహుశా ఆయన దాదాపుగా లక్షఉద్యోగాల భర్తీని ప్రకటించి..నిరుద్యోగుల్ని ఒక్క సారిగా ఆశ్చర్యపరచబోతున్నట్లుగా భావిస్తున్నారు.
సీఎం కేసీఆర్ చాలా కాలం నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి ఉపఎన్నిక సందర్భంలోనూ ఉద్యోగాల భర్తీపై ప్రకటనలు చేసేవారు. త్వరలో అని చెప్పేవారు. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూర్ నగర్, హుజురాబాద్, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ప్రతీ సందర్భంలోనూ ఉద్యోగాల భర్తీపై ప్రకటనలు వచ్చేవి కానీ … నోటిఫికేషన్లు మాత్రం వచ్చేవి కావు. ఇటీవల కొత్తజిల్లాల వారీగా ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయడంతో ఖాళీలపై లెక్క తేలింది. అందుకే..అసెంబ్లీసాక్షిగా కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో యాభై వేల ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది.
నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుండి సరైన నోటిఫికేషన్లు లేకపోవడమే. పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. తాము ప్రభుత్వ రంగంలో ఇవ్వడమే కాదు..ప్రైవేటురంగంలోనూ పెద్ద ఎత్తున పరిశ్రమల్నితీసుకు వచ్చి… లక్షల మంది ఉపాధి కల్పించామని ప్రభుత్వం చెబుతోంది. అయినా నోటిఫికేషన్లకోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మాత్రం అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవలి కాలంలో పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేశాయి. చివరికి నిరుద్యోగల ఆగ్రహాన్ని తగ్గించేందుకు కీలక ప్రకటన చేయాలని డిసైడయినట్లుగా తెలుస్తోంది.