నాగార్జునసాగర్‌లో భారీ మెజార్టీతో గెలిచి టీఆర్ఎస్ హవా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలని… బీజేపీ గెలుపులు గాలి బుడగతో సమానం అని తేల్చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. అందుకే ఈ సారి నాగార్జున సాగర్ వ్యూహాన్ని తానే ఖరారు చేస్తున్నారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పటికీ..తానే స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అన్ని పార్టీల కంటే ముందే కేసీఆర్… నాగార్జునసాగర్‌లో బహిరంగసభ పెట్టబోతున్నారు. ఈ నెల 22 లేదా 23 తేదీల్లో బహిరంగ సభ ఉంటుందని అందులో కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయలేదు. దుబ్బాకలోనూ చివరి రోజు బహిరంగసభ పెడతారని ప్రచారం జరిగింది కానీ.. ఆయన లైట్ తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో చివరికి ఓ సభ పెట్టారు కానీ ప్రయోజనం లేకపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి నాగార్జునసాగర్‌లో ముందుగానే బహిరంగసభ నిర్వహించి.. ప్రజల్లో.. పార్టీ శ్రేణుల్లో కదలిక తేవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ ఫిబ్రవరి, మార్చిలో వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఎదురు చూడకుండా ముందుగానే కసరత్తుచేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి మేలు చేసే అనేక ప్రాజెక్టులు.. పథకాలను మంజూరు చేస్తూ జీవోలిచ్చారు. వాటి విషయంలో ప్రజల్లోసానుకూల చర్చ జరిగేలా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే.. అంత కంటే మంచి పనులుచేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు కూడా… ఉత్సాహంగా ఉన్నాయి.మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాస్త ఆత్మరక్షణ ధోరణిలో ఉన్న టీఆర్ఎస్… చావో రేవో అన్నట్లుగా సాగర్‌లో పోటీ పడాలని భావిస్తోంది.