కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే వస్తున్నారని కరువు బారిన పడిన రైతులకు అండగా ఉండేందుకు వస్తున్నామని చెబుతున్నారు. కానీ గత పదేళ్ల ఎన్నో వైపరీత్యాలు ఎదురైనా ఎందుకు రాలేదు.. ఇప్పుడు ఎందుకు వస్తుననారన్న ప్రశ్న ముందుగా ఎదురొస్తుంది. దీనికి సమాధానం అందిరికీ తెలుసు.. అప్పట్లో పాలకుడు… ప్రగతి భవన్ దాటలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేత పార్టీని కాపాడుకోవాలంటే.. బయటకు రాక తప్పదు.
కేసీఆర్ స్టైల్ రాజకీయం చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఉద్యమ సమయంలో కూడా తెరపైకి రాలేదు. ముఖ్యంగా పార్టీకి ఊపొచ్చిన తర్వాత ఆయన పిలుపునిస్తారు అంతే. ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇక అవసరం లేకపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో మాత్రమే పాల్గొనేవారు. ఆయనను కలవడం కష్టంగా ఉండేదని అప్పట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఇక ప్రజల్ని కలిసిందే లేదు. సీఎంకు ప్రజల్ని కలవాల్సిన అవసరమేమిటని.. కేటీఆర్ లాంటి వారు వాదించారు కూడా.
విపత్తుల సమయంలో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్, మాజీమంత్రులు కేటీయార్, హరీష్ రావులే పరామర్శించేవారు. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ సహా అనేక అంశాల్లో ప్రజల ఆందోళనలను ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే ప్రతిపక్షంలోకి వెళ్లడంతో కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం బయలుదేరుతున్నారు. కానీ ఆయన పదవిలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు రావడంపై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పార్లమెంటు ఎన్నికల్లో గనుక ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ తమను పట్టించుకోనట్లే.. తము కూడా కేసీఆర్ నూ పట్టించుకోకపోతే బీఆర్ఎస్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లవుతుంది.