తెలంగాణ క్యాబినెట్ కూర్పు ఎలా ఉంటుందనే లెక్కలూ అంచనాలూ ఎవ్వరి ఊహకీ అందడం లేదనే చెప్పాలి. మంత్రి మండలి కూర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఏంటనేది ఎవ్వరికీ అర్థం కాదు కదా! జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కూర్పు ఉండొచ్చనీ, రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు అనుకూలమైన పద్ధతిలో క్యాబినెట్ ఉంటుందని… ఇలా రకరకాల విశ్లేషణలున్నాయి. తాజాగా ప్రాజెక్ట్ టూర్ అంటూ కరీంనగర్ పర్యటించిన సీఎం కేసీఆర్ ను పార్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు కలిసినట్టు సమాచారం. ఒక్కక్కరుగా ముఖ్యమంత్రితో భేటీ అయిన ఆ ప్రముఖులకు మంత్రి పదవికి సంబంధించిన కొంత స్పష్టత వచ్చిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
కరీంనగర్ లో బసచేసిన సీఎంను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ పటిష్టతపై చర్చ అనంతరం.. మంత్రి పదవులు ఆశిస్తున్నవారు ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. ఆయనకి ఈసారి పదవి గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి నుంచి హామీ లభించిందని సమాచారం. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను సీఎంను కలిసి… తనకు స్పీకర్ పదవి వద్దని మరోసారి చెప్పినట్టు తెలుస్తోంది! ఈసారి ఈటెలను అసెంబ్లీ స్పీకర్ చేస్తారనే ప్రచారం ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే తనకు ఆ పదవి వద్దని ముఖ్యమంత్రికి చెప్పిన ఈటెల.. మరోసారి అదే అంశాన్ని గుర్తుచేసినట్టు సమాచారం. అయినా సరే, కేసీఆర్ నుంచి సానుకూల సంకేతాలు రాలేదని అంటున్నారు! తెరాస నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన గంగుల కమలాకర్ కు ఈసారి కూడా బెర్త్ లభించే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో భేటీ అనంతరం గంగుల కాస్త డల్ గా ఉన్నారనీ, కొప్పుల ఉత్సాహంతో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇక, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నవారు కూడా ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలుసుకున్నట్టు సమాచారం. ఎంపీ కవిత సిఫార్సుతో ఇద్దరు ప్రముఖులకు పదవులు దక్కుతాయనే ప్రచారం కూడా ఉంది. కేసీఆర్ పర్యటన తరువాత కవిత సిఫార్సు చేసినవారికి కూడా భరోసా వచ్చిందని సమాచారం. ఏదేమైనా, చివరి నిమిషం వరకూ మంత్రి వర్గ కూర్పుపై ఉత్కంఠ ఉండేట్టుగానే కనిపిస్తోంది. క్యాబినెట్ ఏర్పాటుకు సంబంధించి ఈసారి కేసీఆర్ లెక్కలు వేరేగా ఉన్నాయన్నది వాస్తవం.