అనేక ఆటుపోట్లను ఎదుర్కొని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణలో బీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోతున్నారా..?ఇందుకు కారణం ఆయన వరుసగా చేస్తోన్న వ్యాఖ్యలేనా..? అంటే 2019లోక్ సభ ఎన్నికల నాటి నుంచి జాతీయ రాజకీయాల పట్ల కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలను ఇందుకు కారణంగా ఉదాహరిస్తున్నారు పరిశీలకులు.
2019లోక్ సభ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ అంటూ, కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే అధికారమని హడావిడి చేసిన కేసీఆర్ ఆ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఊసే ఎత్తలేదు.పైగా ఆ ఎన్నికల్లో కారు – సారు- పదహారు- ఢిల్లీలో సర్కార్ అంటూ ప్రచారం చేసుకున్న గులాబీ పార్టీ 9 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయినా,బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చడంతో జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తామని, దేశానికి తెలంగాణ మోడల్ అవసరమని జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు. కట్ చేస్తే, 2023ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణలో ఓటమి పాలవ్వడంతో జాతీయ రాజకీయలపై ఇంట్రెస్ట్ ను బీఆర్ఎస్ తగ్గించేసింది.
కేసీఆర్ ను నమ్మి వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ లో చేరిన నేతలు కేసీఆర్ వైఖరి మింగుడుపడక కొత్త దారులు వెతుక్కున్నారు. ఈ సమయంలోనే వచ్చిన లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు సవాల్ గా మారడంతో మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఉనికికి అవసరమే కానీ, జనాలకు వెగటు పుట్టించాయి. 2019లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే పార్లమెంట్ ఎన్నికల్లో చతికిలపడింది.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోయినప్పటికీ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నామనే వ్యాఖ్యలు అతిగా అనిపించాయి.
పార్టీ ఉనికి కోసమే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినా వాటిని ఓటర్లు పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోగా…జనాల్లో కేసీఆర్ పట్ల విశ్వసనీయత సన్నగిల్లేందుకు ఈ వ్యాఖ్యలే కారణమనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి.