తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు. వారిలో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎంలు, ఒకరు లెఫ్ట్ పార్టీ సీఎం. కానీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుండి సపోర్టుగా నిలిచిన కొంత మంది ఎక్కడా కనిపించలేదు. వారిలో ముఖ్యులు కర్ణాటక జేడీఎస్ నేత కుమారస్వామి, మరొకరు తమిళనాడు వీసీకే పార్టీకి చెందిన ఎంపీ తిరుమాలవన్. ఇప్పుడు వారు కేసీఆర్ వెంట లేరు. బీఆర్ఎస్ ఆవిర్భావసభకు కూడా రాలేదు. కేసీఆర్ తో పొత్తులు ఉంటాయని.. ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్తో కలిసి పని చేయాలనివారు అనుకున్నారు. కానీ హఠాత్తుగా డ్రాప్ అయిపోయారు.
నిజానికి కేసీఆర్ సభకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి పొత్తులు ఎవరితోనూ పెట్టుకోదు. కేజ్రీవాల్ కు సొంత లక్ష్యాలున్నాయి. ఆయన రెండు రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన పార్టీకి జాతీయ హోదా కూడా వచ్చింది..కాబట్టి.. కేసీఆర్ ఓ కూటమి పెట్టినా.. అందులో ఆమ్ ఆద్మీ రాదు. అలాగే.. లెఫ్ట్ పార్టీలు కూడా. తెలంగాణలో సీట్ల కోసం లెఫ్ట్ పార్టీలు.. కేసీఆర్ తో పొత్తులు పెట్టుకుంటాయి కానీ.. జాతీయ స్థాయిలో ఆయన వెంట నడవవు. రాహుల్ గాంధీ పాదయాత్రలో లెఫ్ట్ పార్టీల నేతలు పాల్గొంటున్నారు . కేసీఆర్ సభలో పాల్గొన్న సీపీఐ నేత రాజా.. రాహుల్ పాదయాత్రలోనూ పాల్గొంటానని అదే రోజు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
అంటే కేసీఆర్.. సభకు వచ్చిన వారు జాతీయ రాజకీయాల్లో ఆయన వెంట ఉండరు. ఉంటారనుకున్న వారు నమ్మకం కోల్పోయారు. ఈ కారణంగాకేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తొలి అడుగులే తడబడుతన్నాయన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. భారీ ఆర్థిక సాయం ఎన్నికల్లో ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇతర నేతల్ని ఆకర్షిస్తున్నారని.. ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వారిలో అఖిలేష్ లాంటి నాయకులు ఉన్నా.. వారు కేసీఆర్ తో జత కట్టడం అనేది ఉండదని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ .. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే.. నమ్మకస్తులైన నేతల్ని గ్రూపుగా ఉంచుకోవాలన్న సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.