తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో మరోసారి రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని మే 4న అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్గా మారిన అనంతరం పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమలో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 200 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని వసంత్ విహార్ లో 2021 సెప్టెంబర్ లో భవనానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇపుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. నిజానికి అద్దె భవనంలో ప్రారభించిన కార్యాలయంలోనూ రాజశ్యామల యాగం చేశారు. ఇప్పుడు సొంత భవనంలోనూ చేస్తున్నారు.
రాజశ్యామల యాగం చేయాంలటే.. కేసీఆర్ ప్రతీ సారి ఎక్కువగా విశాఖ శారదాపీఠాధిపతిపై ఆధారపడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయనను పట్టించుకోవడం లేదు. ఇతర స్వామిజీలతో చేయించుకుంటున్నారు. సీఎం జగన్ కూడా స్వామిజీని పెద్దగా పట్టించుకోవడంలేదు. అందుకే ఇటీవల జగన్ సర్కార్ పై విమర్శలు చేశారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ సర్కార్ రెండు ఎకరాల భూమిని శారదాపీఠానికి కేటాయించారు. ఆ అంశం కోర్టులో ఉంది. ఇప్పుడు వెనక్కి తీసుకుంటారేమోనన్న భయంతో వెంటనే అక్కడ ఆలయానికి శంకుస్థాపన చేస్తానని స్వరూపానంద చెబుతున్నారు.