తెలంగాణ సర్కార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లుగా కనిపిస్తోంది. ప్రతీ నెలా జీతాలు ఆలస్యమవుతున్నాయి. నచ్చే నెల పరిస్థితి మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందేమోకానీ.. కేంద్రం వల్లే ఈ కష్టాలన్నీ అని చెప్పేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్రం పెడుతున్న ఇబ్బందుల వల్ల తెలంగాణకు రావాల్సిన నలభై వేల కోట్లు రాకుండా పోతున్నాయని.. దీని వల్ల తెలంగాణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల 2022 -23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ కు సమకూరవలసిన ఆదాయంలో 40 వేల కోట్ల రూపాయలకు పైగా తగ్గుదల చోటు చేసుకున్నదని కేసీఆర్ అంచనాకు వచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.అయితే నలభై వేల కోట్లు కేసీఆర్ ఆదాయంగా చెబుతున్నారు కానీ.. అవి రుణాలు. రుణాలు తీసుకోకుడా కేంద్రం..తెలంగాణను కట్టడి చేసిది. అందుకే నిధుల సమస్య తెలంగాణను వేధిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్లుగా రుణాలు అందడం లేదు. ఎఫ్ఆర్బీఎం పరిమితికి అదనంగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేశారని.. వాటిని కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తెలంగాణకు సమాచారం ఇచ్చారు. కేంద్రం ఏవిధంగానైతే అప్పులు తీసుకుంటుందో ఆ నిబంధనలనే తెలంగాణ కూడా పాటిస్తుందని అధికారులు వాదిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అప్పులు తీసుకోవడానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని, లేకుంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చాలా కాలంగా కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ కేంద్రం అంగీకరించడం లేదు. ఇప్పుడుప్రజల ముందే పెట్టాలనుకుంటున్నారు.
అయితే కేసీఆర్ ప్రత్యేక అసెంబ్లీని ఎందుకు పెడుతున్నారన్నది బయటకు చెప్పిన కారణమే ఉండదు. ఇంకా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.